ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పథకానికి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను కంగనా రనౌత్ కలిశారు.  

లక్నో: సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బ్రేవ్ యాక్ట్రెస్ కంగనా రనౌత్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పథకానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ ‘వన్ డిస్ట్రిక్ట్- వన్ ప్రాడక్ట్’ స్కీమ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పథకాన్ని ఇటీవలే ప్రవేశపెట్టింది. ఈ పథకానికి బ్రాండ్ అంబాసిడర్‌గానే కంగనా రనౌత్‌ను ఎంపిక చేశారు.

కంగనా రనౌత్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను ఆయన అధికారిక నివాసంలో కలిసి సమావేశమయ్యారు. ఒక వన్ డిస్ట్రిక్ట్ -వన్ ప్రాడక్ట్‌ను నటి కంగనా రనౌత్‌కు సీఎం అందజేశారు. ఈ సమావేశంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుపరిపాలనపై కంగనా రనౌత్ ప్రశంసలు కురిపించినట్టు తెలిసింది. అయోధ్యలోని రామ మందిరాన్ని సందర్శించాల్సిందిగా ఆమెను సీఎం యోగి ఆదిత్యానాథ్ విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.

Scroll to load tweet…

ఉత్తరప్రదేశ్‌లో 75 జిల్లాలున్నాయి. ప్రాడక్ట్ స్పెసిఫిక్ ట్రెడిషనల్ ఇండస్ట్రియల్ హబ్‌‌లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇటీవలే ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.

సమాచార శాఖ అదనపు కార్యదర్శి నవనీత్ సెహగల్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ ట్వీట్ చేశారు. నటి కంగనా రనౌత్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిశారని వివరించారు. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రాడక్ట్ పథకానికి అంబాసిడర్‌గా కంగనా రనౌత్ వ్యవహరిస్తారని పేర్కొన్నారు.