హైదరాబాద్: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు వై- ప్లస్ భద్రతను కల్పించడంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పందించారు. తన కూతురికి భద్రత కల్పించాలని కంగనా తండ్రి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారని, అందుకే వై- ప్లస్ భద్రత కల్పించామని ఆయన చెప్పారు. 

తన కూతురు కొన్ని సామాజిక అంశాలకు స్పందిస్తున్నారనీ దాంతో మహారాష్ట్రలోని కొందరి గుండెలు ఉడికిపోతున్నాయనీ కంగనా తండ్రి చెప్పారని ఆయన అన్నారు. కంగనా తండ్రి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ కు లేఖ రాశారని, ముఖ్యమంత్రిని కలిసి ఆయన వినతిపత్రం కూడా సమర్పించారని, తన కూతురిని వేధిస్తున్నారని చెప్పారని కిషన్ రెడ్డి వివరించారు 

ఆ వినతిపత్రం ఆధారంగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పరిస్థితిని కేంద్రానికి తెలియజేసినట్లు ఆయన తెలిపారు. ముంబై పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లా కనిపిస్తోందని కంగనా చేసిన వ్యాఖ్యలకు మండిపడిన శివసేన నాయకులు మండిపడ్డారు. ముంబైకి రావద్దని కంగనాను హెచ్చరించారు. 

వై- ప్లస్ భద్రత కింద కంగనాకు రక్షణగా 24 గంటలు పది మంది సాయుధ కమెండోలు ఉంటారు. మహారాష్ట్ర ప్రభుత్వంపైనా, శివసేనపైనా, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపైనా కంగనా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.