ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వానికి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు మధ్య వివాదం మరింతగా ముదురుతోంది. చండీగఢ్ నుంచి ముంబై చేరుకున్న కంగనా ప్రత్యేక వాహనంలో తన నివాసానికి చేరుకున్నారు. కంగనా వచ్చే సమయంలో శివసేన కార్యకర్తలు పెద్ద యెత్తున విమానాశ్రయాన్ని చుట్టుముట్టారు. దీంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. రన్ వైపై నుంచే కంగనాను ప్రత్యేక వాహనంలో బయటకు తీసుకుని వచ్చారు. 

ఆ తర్వాత కంగనా రనౌత్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. చేసిందేదో మంచికే చేశారని ఆమె ముఖ్యమంత్రిని ఉద్దేశించి అన్నారు. ఈ మేరకు బుధవారం సాయంంత్రం ట్విట్టర్ లో ఓ వీడియోను విడుదల చేశారు. ఈ రోజు నా ఇంటిని కూల్చేవేశారు, రేపు మీ అహంకారాన్ని కూల్చేస్తారు అని ఆమె ఉద్ధవ్ థాకరేను ఉద్దేశించి అన్నారు. 

తమను లోయ నుంచి 1990 దశకంలో పంపించినప్పుడు కాశ్మీర్ పండితులు ఏ విధమైన భావనకు గురయ్యారో ఈ రోజు తనకు అనుభవంలోకి వచ్చిందని ఆమె అన్నారు.  

 

శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హైకోర్టులో విజయం సాధించారు. ముంబైలోని తన మణికర్ణిక భవనం కూల్చివేతపై కంగనా హైకోర్టును ఆశ్రయించారు. భవనంపై కూల్చివేతపై హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో మణికర్ణిక కార్యాలయాన్ని కూల్చడానికి సిద్ధపడిన బీఎంసీ వెనక్కి తగ్గాల్సి ఉంటుంది.

అంతకు ముందు కంగనా తన భవనం కూల్చివేతపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తన కార్యాలయం తనకు రామ మందిరమని, దాన్ని కూల్చడానికి బాబర్ సిద్ధపడ్డారని ఆమె వ్యాఖ్యానించారు. అదే సమయంలో కూల్చివేతను సవాల్ చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించింది.

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు ఆమెకు చెందిన పాళి హిల్ భవంతికి బీఎంసీ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. అనుమతి తీసుకోకుండా బంగళాకు మార్పులు చేర్పులు చేశారని ఆరోపిస్తూ ఆ నోటీసులు జారీ అయ్యాయి.