న్యూఢిల్లీ: శబరిమల ఆలయంలోకి ప్రవేశం కోసం బిందు, కనకదుర్గలు మరోసారి సుప్రీంకోర్టు తలుపుతట్టారు. శబరిమల తీర్పు విషయంలో  వేసిన రివ్యూ  పిటిషన్లలో తమను కూడ చేర్చాలని  కోరారు.

సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఇద్దరు మహిళలు బిందు, కనకదుర్గలు ఇదివరకే శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకొన్నారు. పోలీసుల సహాయంతో  ఈ ఇద్దరు అయ్యప్పను దర్శించుకొన్నారు. ఆ తర్వాత వీరిద్దరికి హిందూ సంఘాల నుండి పెద్ద ఎత్తున నిరసనలు ఎదురయ్యాయి. 

శబరిమల ఆలయంలో  అయ్యప్పను దర్శించకుకొన్నందుకు  తమకు తీవ్రమైన బెదిరింపులు వస్తున్నాయని, ప్రాణహాని కూడ ఉందని రక్షణ కల్పించాలని కోరుతూ వీరిద్దరూ కూడ గత మాసంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  ఈ విషయమై విచారించిన సుప్రీంకోర్టు బిందు,కనకదుర్గలకు రక్షణ కల్పించాలని  కేరళ సర్కార్‌ను ఆదేశించింది.

గత ఏడాదిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఈ ఏడాది జనవరి రెండో తేదీన అయ్యప్పను వీరిద్దరూ దర్శించుకొన్నారు.  అయ్యప్పను దర్శించుకొన్న తర్వాత ఈ ఇద్దరు కూడ అజ్ఞాత ప్రదేశంలో తలదాచుకున్నారు. ఈ ఏడాది జనవరి 15వ తేదీన ఇంటికి వెళ్తే కనకదుర్గపై ఆమె అత్త దాడి చేసిన విషయం తెలిసిందే.