మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ దాదాపుగా ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఈ సారి రాకపోతే ఇక లాభం లేదనుకున్న దశలో కాంగ్రెస్ హైకమాండ్ కమల్‌నాథ్‌నే నమ్ముకుంది..

ఎన్నికలకు సరిగ్గా ఆరు నెలల ముందు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ప్రజలలో మంచి పట్టుున్న శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ఎదురొడ్డి నిలిచి కాంగ్రెస్‌కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు కమల్ నాథ్.

నవంబర్ 18, 1946న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించిన ఆయన విద్యాభ్యాసం కోల్‌కతాలో సాగింది. ఆ సమయంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ పెద్ద కుమారుడు సంజయ్ గాంధీతో అనుబంధం ఏర్పడింది. అతని ద్వారా గాంధీ కుటుంబానికి కమల్‌నాథ్ సన్నిహితుడయ్యారు.

1968లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన ఇందిరా నేతృత్వంలోని కేంద్రప్రభుత్వంలో కీలక వ్యక్తిగా మారారు. 1979లో మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి ఇందిరాగాంధీకి తెరచాటు నుంచి కమల్‌నాథ్ ఎంతగానో సహకరించారు.

సంజయ్‌గాంధీ, కమల్‌నాథ్‌లు ఇందిరాగాంధీకి రెండు చేతులని అప్పట్లో పార్టీ నేతలు అభివర్ణించేవారు. అలాగే ఇందిర సైతం కమల్‌నాథ్‌ను తన మూడో కుమారుడని చెప్పేవారని అంటుంటారు. 1980లో మొదటిసారి చింద్వారా నుంచి ఎంపీగా ఎన్నికయిన ఆయన ఇప్పటి వరకు 9 సార్లు ఇదే నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించారు.

యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. యూపీఏ ప్రభుత్వం సజావుగా సాగడానికి ప్రధానశక్తిగా వ్యవహారించారు. అయితే ఆయన్ను వివాదాలు సైతం వెంటాడాయి. 70వ దశకంలో కాంగ్రెస్‌తో పాటు నాటి కేంద్రప్రభుత్వంలో కీలకవ్యక్తిగా వ్యవహారించిన కమల్‌నాథ్ అమెరికాకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని, దేశ రహస్యాలను అగ్రరాజ్యానికి చేరవేశాడని వికిలీక్స్ 1976లో ప్రచురించిన కథనం అప్పట్లో సంచలనం కలిగించింది.

అలాగే యూపీఏ సర్కారుపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా గండాన్ని గట్టెక్కించడానికి కమల్‌నాథ్ కొందరు ఎంపీలకు లంచాలిచ్చి మద్ధతు కూడగట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే కేంద్రమంత్రిగా కమల్‌నాథ్ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.

పర్యావరణ ట్రిబ్యునల్ ఏర్పాటు, పర్యావరణ మదింపును ప్రవేశపెట్టడం, పర్యావరణ బ్రిగేడ్‌ల ఏర్పాటుతో పాటు నూతన జౌళి విధానం తెచ్చారు. పత్తి ఎగుమతి భారీగా పెరిగాయి, పరిశ్రమల మంత్రిగా 7 ఏడు రెట్లు ఎఫ్‌డీఐలు పెంచేలా చేశారు.

విదేశీ వాణిజ్య విధానాన్ని తెచ్చి ఎగుమతుల పెంపు, భారీగా ఉపాధి కల్పనకు దోహదపడ్డారు. రాజకీయాలతోనే కాక పారిశ్రామిక వేత్తగా, వ్యవసాయదారుడిగా, సామాజికవేత్తగా సేవలందించారు. అలాగే ‘ఇండియాస్ ఎన్విరాన్ మెంటల్ కనసర్న్స్’, ‘ఇండియాస్ సెంచరీ’ ‘భారత్‌ కీ శతాబ్ధి’ వంటి పేరుతో పుస్తకాలు కూడా రాశారు.