ఢిల్లీ: డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ అత్యుత్సాహం కాంగ్రెస్ పార్టీ కొపముంచేంత పనైంది. తన తండ్రి దివంగత సీఎం కరుణానిధి విగ్రహావిష్కరణకు బీజేపీ యేతర కీలక నేతలు హాజరయ్యారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు పలువురు జాతీయ నాయకులు హాజరయ్యారు. 

తన తండ్రి విగ్రహావిష్కరణకు జాతీయ నేతలు పెద్ద ఎత్తున తరలిరావడంతో స్టాలిన్ ఉబ్బితబ్బిబయ్యారు. ఆ ఆనందంలో  కాంగ్రెస్ ఫ్రంట్ కు ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ అంటూ ప్రకటించేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి అంటూ ఆయన వ్యాఖ్యలు చెయ్యడంతో బీజేపీ సెటైర్లు వెయ్యడం మెుదలు పెట్టింది. 

అయితే రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వంపై స్టాలిన్ నోరు జారడంతో కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రాహుల్‌ ఏనాడు తాను ప్రధాని కావాలని కోరుకుంటున్నట్టు చెప్పలేదని మధ్యప్రదేశ్‌ నూతన సీఎం కమల్‌ నాథ్‌ స్పష్టం చేశారు. రాహుల్‌ సహా కాంగ్రెస్‌ నేతలెవరూ ప్రధాని పదవిపై తొందరపాటుతో లేరని చెప్పారు. 

ప్రధాని పదవిని కోరుకుంటున్నట్టు రాహుల్‌ ఎన్నడూ పెదవివిప్పలేదని, భాగస్వామ్య పార్టీలతో సంప్రదింపుల అనంతరం తీసుకునే నిర్ణయానికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం తీసుకోవాల్సిన నిర్ణయంపై ఇప్పుడే పేర్ల గురించి కసరత్తు చేయడం తొందరపాటు అవుతుందని అభిప్రాయపడ్డారు. 

అటు రాహుల్‌ గాంధీని ప్రధాని అభ్యర్ధిగా డీఎంకే ప్రతిపాదించడంపై బీఎస్పీ, ఎస్పీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ వంటి పార్టీలు తమ అసంతృప్తి వ్యక్తం చేశాయి. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌ల గైర్హాజరుకు స్టాలిన్‌ ప్రతిపాదనే కారణమంటూ వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. 

ఈ నేపథ్యంలో వారి గైర్హాజరుపై మధ్యప్రదేశ్ సీఎం కమల్‌ నాథ్‌ స్పందించారు. మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేష్ యాదవ్ లు వ్యక్తిగత కారణాలతోనే ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకాలేదని స్పష్టం చేశారు. స్టాలిన్ వ్యాఖ్యలకు దానికి ఏ మాత్రం సంబంధం లేదని కొట్టిపారేశారు.