తన ప్రభుత్వానికి ఏ విధమైన ఢోకా లేదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ అన్నారు. బిజెపి ఇస్తున్న డబ్పులు తీసుకోవాలని తాను ఎమ్మెల్యేలకు చెప్పినట్లు ఆయన తెలిపారు.

భోపాల్: తన ప్రభుత్వానికేమీ ఢోకా లేదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష బిజెపి కాంగ్రెసు ఎమ్మెల్యేలకు వల వేస్తుందని వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ ఆయన జర్నలిస్టుల వద్ద ఆ ధీమా వ్యక్తం చేశారు. 

తమకు ఫ్రీ మనీ వస్తోందని ఎమ్మెల్యేలు తనతో చెబుతున్నారని, ఆ డబ్బులు తీసుకోవాలని తాను ఎమ్మెల్యేలతో చెబుతున్నానని ఆయన అన్నారు. ఓ కార్యక్రమానికి హాజరైన కమల్ నాథ్ జర్నలిస్టులతో కాసేపు మాట్లాడారు. 

ప్రభుత్వం అస్థిరతకు గురయ్యే అవకాశం ఉందా అని విలేకరులు అడిగేతి దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జవాబిచ్చారు. 

Also Read: సంక్షోభంలో కమల్నాథ్ ప్రభుత్వం: గుర్గావ్ హోటల్లో ఎమ్మెల్యేలు

కాంగ్రెసు చేస్తున్న ఆరోపణలతో తమకేమీ సంబంధం లేదని బిజెపి అధికార ప్రతినిధి రాజనీష్ అగర్వాల్ అన్నారు. కమల్ నాథ్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. రాజ్యసభ ఎన్నికలకు జరిగే నామినేషన్ జరగాల్సిన నేపథ్యంలో కాంగ్రెసులోని అంతర్గత తగాదాలే దానికి కారణమని ఆయన అన్నారు. 

బిజెపి తమ పార్టీ ఎమ్మెల్యేలకు వల వేస్తోందని, వారిని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తోందని సీనియర్ కాంగ్రెసు నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. దిగ్విజయ్ సింగ్ సంచలనం కోసం తప్పుడు ప్రకటన చేశారని మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహన్ అన్నారు. అది దిగ్విజయ్ సింగ్ కు అలవాటేనని ఆయన అన్నారు.