మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్, ప్రఖ్యాత నటుడు కమల్ హాసన్.. భజరంగ్ దళ్ కార్యకర్త 26 ఏళ్ల హర్ష హత్యపై స్పందించారు. అలాంటి హత్యా రాజకీయాలకు తాను బద్ద వ్యతిరేకి అని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ హత్యను పరోక్షంగా పేర్కొంటూ.. ఈ హత్యల పరంపర ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు.
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదం(Hijab Controversy) కలకలం రేపుతుండగా, మరో ఘటన పరిస్థితులను ఉద్రిక్త పరుస్తున్నది. నిన్న రాత్రి భజరంగ్ దళ్(Bajrang Dal) కార్యకర్త 26 ఏళ్ల హర్షను కొందరు గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచి చంపేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై అటు బీజేపీ(BJP), ఇటు కాంగ్రెస్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఓ కాలేజీలో కాషాయ జెండా ఎగరేసిన ఘటనను ఆధారంగా చేసుకుని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ రెచ్చగొట్టారని, దాని పర్యావసనంగానే నేడు భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య జరిగిందని కర్ణాటక మంత్రి ఆరోపణలు చేశారు. హిజాబ్ వివాదానికి ఈ హత్యతో సంబంధం ఉన్నదని వివరించారు. కాగా, అవన్నీ నిరాధారమైన ఆరోపణలు అని, ఆయన పిచ్చివాడని కాంగ్రెస్ తిప్పికొట్టింది. రాష్ట్ర హోం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న శివమొగ్గలోనే ఈ దారుణం జరిగిందని, వెంటనే ఆయన తన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసింది. కాగా, ఈ ఘటనపై మక్కల్ నీది మయ్యం పార్టీ చీఫ్ కమల్ హాసన్(Kamal Hassan) కూడా స్పందించారు.
అలాంటి రాజకీయాలకు నేను బద్ద వ్యతిరేకిని అంటూ కమల్ హాసన్ పేర్కొన్నారు. 1948 జనవరి 30వ తేదీన ఒక మర్డర్‌తో ఇది ప్రారంభమైందని, ఇప్పటికీ కొనసాగుతున్నదని ఆయన వివరించారు. 1948 జనవరి 30వ తేదీన జాతిపిత మహాత్మా గాంధీ హత్య జరిగిన సంగతి తెలిసిందే. మహాత్మా గాంధీని నాథురాం గాడ్సే హత్య చేశారు.
ఇదిలా ఉండగా, రాష్ట్ర హోం మంత్రి జ్ఞానేంద్ర ఈ ఘటనపై మాట్లాడుతూ.. హర్ష హత్యకు.. రాష్ట్రంలో రగులుతున్న హిజాబ్ వివాదానికి సంబంధం లేదని కొట్టిపారేశారు. శివమొగ్గ చాలా సున్నితమైన నగరం అని వివరించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారని హోం మంత్రి కార్యాలయం తెలిపింది.
హోం మంత్రి జ్ఞానేంద్ర హర్ష కుటుంబ సభ్యులను హాస్పిటల్‌లో ఈ రోజు ఉదయం కలిశారు. వారిని ఓదార్చారు. హర్ష కుటుంబ సభ్యులకు సంఘీభావం ప్రకటించారు. హర్ష హత్యలో నలుగురైదుగురు నిందితుల హస్తం ఉండచ్చని తెలిపారు. పోలీసులకు ఈ హత్య గురించి కొన్ని క్లూలు దొరికాయని, త్వరలోనే హర్ష హత్యకు సంబంధించిన కారణాలను వెలుగుచూడవచ్చని వివరించారు. హర్ష హత్య వెనుక ఏదైనా సంస్థ ఉన్నదా? అనే విషయంపై ఇంకా ఆధారాలు అయితే లేవని చెప్పారు. ఘటన తర్వాత సరిపడా సెక్యూరిటీ అరేంజ్ చేశామని, గత రాత్రి కొన్ని ఆందోళనలు జరిగినా.. ఇప్పుడు పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని పేర్కొన్నారు.
హిజాబ్ వివాదంతో హర్ష హత్యకు సంబంధం ఉన్నదనే వాదనలను కర్ణాటక పోలీసు అధికారి ఒకరు కొట్టి పారేశారు. శివమొగ్గ జిల్లాలోని దొడ్డపేటలో ఈ ఘటనపై కేసు నమోదైందని వివరించారు. ఈ ఘటనలో తమకు కొన్ని క్లూలు లభించాయని పేర్కొన్నారు. త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని చెప్పారు. దీనికి హిజాబ్ వివాదంతో సంబంధమే లేదని అన్నారు. హర్షకు ఆ గ్యాంగ్‌తో ఇది వరకే పరిచయాలు ఉన్నాయని వివరించారు. బహుశా వారి మధ్య పాత కక్ష్యల కారణంగానే హత్య జరిగి ఉండవచ్చని పేర్కొన్నారు. గత రాత్రి 9 గంటల ప్రాంతంలో హర్షపై దాడి జరిగి ఉండొచ్చని చెప్పారు. ఆయనను వెంటనే హాస్పిటల్‌కు తరలించినా.. ప్రాణాలు దక్కలేవని వివరించారు.
