వచ్చే అసెంబ్లీ తాను పోటీ చేయడం ఖాయమని సినీ నటుడు కమల్ హాసన్ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల ప్రచారాన్ని ప్రారంభించిన మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్.. తన పోటీపై కీలక ప్రకటన చేశారు. సోమవారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని చెప్పారు. అంతేగాక తను పోటీ చేసే నియోజకవర్గంపై కూడా త్వరలో స్పష్టత ఇస్తానన్నారు.

 ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసేది తెలుపుతా అన్నారు. మరో సూపర్ స్టార్ రజినీ కాంత్ కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇరువురు నేతల పోటీపై తమిళనాట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వీరిద్దరూ ఎన్నికలకు దూరంగా ఉంటారా.. పార్టీ కోసం మాత్రమే పని చేస్తారా అన్న విషయాలు చర్చనీయాంశమయ్యాయి. అయితే కమల్ ప్రకటనతో ఆయన పోటీ కచ్చితం కాగా... ఇక రజినీ ప్రకటన చేయాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే, మదురైలో ఆదివారం ప్రచారం చేసిన కమల్.. తమ పార్టీ అధికారంలోకి  వస్తే మదురైని రెండో రాజధానిగా చేస్తానని ప్రకటించారు. ప్రజల వద్దకే పాలనను అందించడానికి తాను సిద్ధమని, సగం దేశం ఆక‌లి బాధ‌తో ఉంటే, కొత్త పార్లమెంట్ బిల్డింగ్ అవ‌స‌ర‌మా? అని ప్రశ్నించారు. దేశ జనాభాలో సగం మంది తిండీతిప్పలు లేకుండా అల్లాడుతుంటే కొత్త పార్లమెంట్ భవనం అవసరమా అని ప్రశ్నించారు. ప్రజలు అర్ధాకలితో అలమటిస్తుంటే అంత ఖర్చు పెట్టి కొత్త భవనం ఎందుకు కడుతున్నారని మండిపడ్డారు.