ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు  కమల్ హాసన్.. తమిళనాడు రాజకీయాల్లో తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆయన తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ కూడా మొదలుపెట్టారు. అయితే.. తమ పార్టీలో  చేరాలనుకునే అభ్యర్థులకు ఆయన ఓ కండిషన్ పెట్టారు.

పార్టీ లో చేరాల‌నుకునే స‌భ్యులు 25 వేల రూపాయ‌లు చెల్లించి ఆన్‌లైన్‌లో ద‌రఖాస్తు చేసుకోవ‌ల‌సి ఉంటుంద‌ని ఆయ‌న సోమ‌వారం సాయంత్రం పేర్కొన్నారు. పార్టీయేతర సభ్యులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని ఆయ‌న ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. మేలో జ‌ర‌గ‌నున్న ఎల‌క్ష‌న్స్ కోసం క‌మ‌ల్ బ్యాట‌రీ టార్చ్ సింబ‌ల్‌తో పోటీ చేయ‌నున్నారు. 

కొద్ది రోజుల క్రితం క‌మ‌ల్ త‌న కాలుకు శ‌స్త్ర చికిత్స చేయించుకోగా, ప్ర‌స్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. వ‌చ్చే నెల నుండి పార్టీ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన‌నున్న‌ట్టు తెలుస్తుంది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆయ‌న పార్టీ పోటీ చేయ‌నుంద‌ని క‌మ‌ల్ గతంలోనే స్ప‌ష్టం చేశారు. సినిమాల విష‌యానికి వ‌స్తే కొద్ది రోజుల క్రితం భార‌తీయుడు 2 చిత్రం మొద‌లు పెట్టిన క‌మ‌ల్ ఈ మూవీని ఎల‌క్ష‌న్స్ త‌ర్వాత పూర్తి చేయ‌నున్నాడ‌ని స‌మాచారం.