తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలో జరగనున్న నేపథ్యంలో బీజేపీలోకి ఇతరపార్టీల నేతల వలసలు ప్రారంభమయ్యాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీకి షాక్‌ తగిలింది. 

మక్కల్ నీధి మయ్యం అధినేత, ప్రముఖ నటుడు కమల్‌హాసన్‌కు ఊహించని షాక్ తగిలింది. మక్కల్ నీధి మయ్యం ప్రధాన కార్యదర్శి ఎ. అరుణాచలం పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. 

కాగా, సీనియర్ నేతగా ఉన్న అరుణాచలం పార్టీపై అసంతృప్తితోనే బీజేపీలో చేరినట్టు ప్రకటించారు. కాగా మరికొందరు కమల్ పార్టీ నేతలు సైతం బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో కమల్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

తమిళ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేందుకే తాను క‌ృషి చేస్తున్నానని కమల్ హాసన్ అంటున్నారు. ఆయన ఐదు నెలల్లో రానున్న తమిళనాడు ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటికే మదురై నుంచి ప్రారంభించారు. ప్రజలను ఆకర్షించే విధంగా హామీలను గుప్పిస్తున్నారు. మక్కల్ నీది మయ్యం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలను చేర్చారు.