తాను ఎన్నో ఆశయాలు, లక్ష్యాలతో పార్టీని స్థాపించానని.. వాటికి విరుద్ధంగా వ్యవహరిస్తే... పార్టీని ఎత్తేస్తానని మక్కల్ నీది మయ్యం అధ్యక్షులు, నటుడు కమల్ హాసన్ .. కార్యకర్తలను హెచ్చరించారు. కరోనా వైరస్ దేశంలో విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో.. ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు హోటల్ లో పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పార్టీ కార్యకర్తలతో తరచూ సమావేశం అవుతున్నారు. ఇటీవల పార్టీ జిల్లా, రాష్ట్ర నేతలతో ముఖ్యమైన అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ వివరాలను పార్టీ నేత ఒకరు వివరించారు. సుమారు 3 గంటలపాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో ఒక్కో ప్రాంతాన్ని ప్రస్తావిస్తూ పార్టీ కార్యక్రమాలను విశ్లేషించుకున్నాం. 

పార్టీ ఆశయాలు, లక్ష్యాలను పార్టీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచాలని నిర్ణయించాం. మొత్తం 37 అంశాలపై కమల్‌ చర్చించారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం మధ్యాహ్నం 3 గంటల వరకు సాగింది. సమావేశం ప్రారంభంలోనే నేతలు తమ అభిప్రాయాలను వెల్లడిచేయవచ్చని కమల్‌ కోరారు. 

నిర్వాహకుల సందేహాలను తీర్చిన కమల్‌హాసన్‌ పలు ఆదేశాలతోపాటు హెచ్చరికలను సైతం జారీచేశారు. పార్టీ విధానాలు మీ ద్వారా ప్రజల్లోకి చొచ్చుకు పోవాలంటే వాటిపై మీకు పూర్తి అవగాహన ఉండాలని సూచించారు.  అందుకే  తాను ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెపపారు. తాను చెన్నైలో ఉండే నిర్వాహకుల పనితీరుపై నిఘా పెట్టి ఉంచుతానని అన్నారు. 

తమకింద పనిచేసేవారికి విలువ ఇవ్వాలని చెప్పారు. పార్టీ నిర్వహణలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు ఉండకూడదన్నారు. తన భవిష్యత్తును పూర్తిగా ప్రజాసేవకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని పార్టీని ప్రారంభించినపుడే తాను  స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. అయితే తన మాటలను కొందరు హేళన చేయవచ్చని అభిప్రాయపడ్డారు.  

తన రాజకీయ పయనంలో నిర్వాహకుల వల్ల ఎదైనా ఆటకం కలిగితే తీవ్ర చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఆశయాలు, లక్ష్యాలను కాదని తప్పుడు మార్గంలో పయనిస్తే పార్టీ ఎత్తేసి మరో మార్గంలో ప్రజాసేవ వైపు వెళ్లేందుకు కూడా వెనుకాడనని చెప్పారు. నిజాయితీతో కూడిన నా భావిజీవితం కోసం మీలోని ప్రతి ఒక్కరిపై ఎంతో ఆశలు పెట్టుకున్నాను అని చెప్పారు. ఈ పార్టీ కోసం నా వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేస్తున్నాను అని అన్నారు.