తాను రాష్ట్రపతి అభ్యర్థిని కాదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తటస్థంగా ఉండే అభ్యర్థిని ఏన్డీఏకు సూచించానని చెప్పుకొచ్చారు.
ఢిల్లీ : దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని.. ఆర్థిక వ్యవస్థ బాగోలేదని ప్రధాని మోదీ, అమిత్ షాలకు స్పష్టంగా చెప్పానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ వెల్లడించారు. నేడు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఎకానమీ సమ్మిట్ పెట్టాలని కోరానని తెలిపారు. బిజెపి అభ్యర్థే రాష్ట్రపతి ఎన్నికల్లో భారీ మెజారిటీ తో గెలుస్తారన్నారు. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ప్రతిపక్షాలు ఐక్యం కావాలని.. ప్రతిపక్షాలు వేరువేరు కూటములుగా ఉండద్దని పాల్ సూచించారు. ఆయన మాట్లాడుతూ…‘నేను ఓడిపోయే వారి పక్షాన ఉండను. ప్రతిపక్షాల్లో ఐక్యత లేదు. ప్రతిపాదించిన వారు కూడా రాష్ట్రపతి అభ్యర్థులుగా ఉండటానికి ఇష్టపడటం లేదు. బిజెపి అభ్యర్థి 60 శాతం ఓట్లతో గెలుస్తారు.
నేను రాష్ట్రపతి అభ్యర్థి కాదు. బిజెపి, కాంగ్రెస్ ల వల్ల దేశం నాశనం అయిపోతుంది. దేశ అభివృద్ధిపై రాజకీయ పక్షాలు దృష్టి సారించాలి. ప్రతిపక్షాలు ఐక్యంగా లేకపోవడం వల్లే బిజెపి బలంగా ఉంది. మంచి తటస్థ అభ్యర్థిని ఎన్డీఏకు ప్రతిపాదించాను. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని మోడీ, అమిత్ షా, పురుషోత్తం రూపాలకు తెలిపాను. నాతో 18 పార్టీలు సేవ్ సెక్యులర్ ఇండియా కూటమిలో ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నికల విషయంలో నాలుగు కూటములుగా ఉన్నాయి. కేసీఆర్ తో సేవ్ సెక్యులర్ ఇండియా రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించాను. కెసిఆర్ కి వచ్చే ఎన్నికల్లో ఎంపీలు ఉండరు’ అని పేర్కొన్నారు.
Presidential poll 2022: రాష్ట్రపతి ఎన్నికలు.. ఇప్పటివరకు 11 నామినేషన్ల దాఖలు.. ఎవరేవరంటే..?
ఇదిలా ఉండగా, జూన్ 7న కేఏ పాల్ జనసేనపార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ జనసేనను వదిలి ప్రజాశాంతి పార్టీలో చేరితే ఎమ్మెల్యేనో, ఎంపీగానో గెలిపిస్తానన్నారు. పవన్‌ను గెలిపించుకోలేకపోని పక్షంలో ఆయనకు రూ. వెయ్యి కోట్లు ఇస్తానని కూడా చెప్పారు. పలు రాజకీయ పార్టీలతో పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకోవడంపై పాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ ఏ పార్టీతో పొత్త పెట్టుకుని పోటీ చేసినా గెలవలేరని విమర్శించారు. పవన్ బీజేపీతో పొత్తులో ఉంది ఆయన ప్రసంగంలో బైబిల్‌ను ఉటంకిస్తూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
పవన్ కల్యాణ్ జీవితంలో ముఖ్యమంత్రి కాలేడని విమర్శించారు. అసలు ఎమ్మెల్యే అవుతాడా అంటూ ప్రశ్నించారు. అవినీతి పార్టీలతో పొత్తులు పెట్టుకున్న అతిపెద్ద అవినీతి పరుడని ఆరోపించాడు. పవన్ కల్యాణ్ డ్యాన్స్‌లు చేసి.. ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న పది లక్షల కోట్ల రూపాయల అప్పులు తీర్చుతాడా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల కోసం ఏ రాజకీయ పార్టీతో ప్రజాశాంతి పార్టీ పొత్తు పెట్టుకోవడంంలేదని కేఏ పాల్ స్పష్టం చేశారు.
2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా ఉన్న చంద్రబాబు.. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలం చెందారని విమర్శించారు. చంద్రబాబు తన ఆస్తులను కాపాడుకునేందుకే తన కుమారుడు లోకేష్‌ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారని కేఏ పాల్ ఆరోపించారు. జగన్ అవినీతి గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని.. ఆయన అవినీతి గురించి అందరికి తెలుసని అన్నారు.
