మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్, బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియాలు నువ్వా నేనా అంటూ తలపడుతున్నారు.

ఈ క్రమంలో తనను ఉద్దేశించి కమల్ నాథ్.. కుక్క (డాగ్) అని వ్యాఖ్యానించిన విషయాన్ని సింధియా ప్రస్తావిస్తూ.. అవును, నేను కుక్కనే ! ప్రజలే నా యజమానులు, కుక్క తన యజమానిని రక్షిస్తూనే ఉంటుందని సింధియా కౌంటరిచ్చారు.

అయితే సింధియాను కమల్ నాథ్ అలా ‘కుక్క’ అనలేదని, అసలు ఏ నాయకుడిని అలా అనలేదని ఆయన తరఫు ప్రతినిధి నరేంద్ర సలూజా పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఇమ్రతీ దేవిని కమల్ నాథ్.

‘ఐటెం’ అంటూ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అతనికున్న స్టార్‌ క్యాంపెయినర్‌ హోదాను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

మహిళ పట్ల ఇలాంటి పదాలను వాడటం కమిషన్ జారీ చేసిన నియమాలను ఉల్లంఘించడమే అని పేర్కొంది. రాజకీయ పార్టీ నాయకుడిగా ఉన్నప్పటికీ, కమల్‌ నాథ్ ప్రవర్తనా నియమావళి నిబంధనలను పదేపదే ఉల్లంఘించారని తెలిపింది.

ప్రస్తుత మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌పై కమల్‌ నాథ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది.

ఫలితంగా ఇకనుంచి కమల్‌ నాథ్‌ ఏదైనా నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొంటే.. మొత్తం వ్యయాన్ని ఆ నియోజకవర్గ అభ్యర్థినే భరించాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్‌ తన ఉత్తర్వులలో స్పష్టం చేసింది.