Asianet News TeluguAsianet News Telugu

భర్త చివరి కోరిక తీర్చిన సైనికుడి భార్య.. ఆర్మీ ఆఫీసర్‌గా భారత సైన్యంలోకి

దేశ సేవలో అమరుడైన భర్త అడుగుజాడల్లో భార్య కూడా సైన్యంలో చేరి ఆయనపై ప్రేమను చాటుకున్నారో భార్య. 2018లో జమ్మూ కాశ్మీర్‌లో (jammu and kashmir) జరిగిన ఆపరేషన్ సమయంలో అమరుడైన నాయక్ దీపక్ నైన్వాల్ (Naik Deepak Nainwal) భార్య జ్యోతి నైన్వాల్ (Jyoti Nainwal) భారత సైన్యంలో చేరారు

Jyoti Nainwal wife of Kulgam martyr Naik Deepak Nainwal joins Indian army as officer
Author
Chennai, First Published Nov 20, 2021, 9:15 PM IST

దేశ సేవలో అమరుడైన భర్త అడుగుజాడల్లో భార్య కూడా సైన్యంలో చేరి ఆయనపై ప్రేమను చాటుకున్నారో భార్య. 2018లో జమ్మూ కాశ్మీర్‌లో (jammu and kashmir) జరిగిన ఆపరేషన్ సమయంలో అమరుడైన నాయక్ దీపక్ నైన్వాల్ (Naik Deepak Nainwal) భార్య జ్యోతి నైన్వాల్ (Jyoti Nainwal) భారత సైన్యంలో చేరారు. శనివారం చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో (Officers Training Academy) ఉత్తీర్ణత సాధించిన 29 మంది మహిళల్లో ఇద్దరు పిల్లలకు తల్లి అయిన జ్యోతి నైన్వాల్ కూడా ఒకరు.

దీపక్ నైన్వాల్ ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రం చమోలి జిల్లా కంచులా (Chamoli district) గ్రామానికి చెందినవారు. ఆయన 1 మహర్ రెజిమెంట్‌లో విధులు నిర్వర్తించారు. ఈ క్రమంలో దీపక్.. జమ్మూకాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో పోస్టింగ్ పొందారు. ఏప్రిల్ 10, 2018లో జరిగిన ఆపరేషన్ సమయంలో ఆయనపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన దీపక్ దాదాపు ఆసుపత్రిలో దాదాపు 40 రోజుల పాటు మృత్యువుతో పోరాడుతూ మే 20న తుదిశ్వాస విడిచారు. భర్త మరణంతో కృంగిపోకుండా ఆయన అడుగుజాడల్లో దేశసేవలో భాగం కావాలని జ్యోతి నిర్ణయించుకున్నారు. 

32 ఏళ్ల జ్యోతి నైన్వాల్ తన నాల్గవ ప్రయత్నంలో ఎస్ఎస్‌సీ పరీక్షల్లో (ssc exams) ఉత్తీర్ణ సాధించి చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఏడాది పాటు శిక్షణ తీసుకున్నారు. భర్త దివంగత దీపక్ నైన్వాల్ కుటుంబంలో జవాన్లు, ఇతర నాన్ ఆఫీసర్ ర్యాంకర్లలో ఆమె తొలి అధికార హోదాను పొందిన వ్యక్తిగా జ్యోతి గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక జాతీయ దినపత్రికు ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్యోతి మాట్లాడుతూ.. తన భర్త చివరి కోరికను తీర్చగలిగినందుకు సంతోషంగా వుందని చెప్పారు. 

వెన్నెముక, ఛాతీలో బుల్లెట్లు దూసుకెళ్లడంతో దీపక్ శరీరంలో చలనాన్ని కోల్పోయారని ఆమె తెలిపారు. ఢిల్లీలోని ఆసుపత్రిలో 40 రోజుల పాటు మృత్యువుతో పోరాడుతున్న సమయంలో తనను సైన్యంలో చేరాల్సిందిగా కోరారని జ్యోతి గుర్తుచేసుకున్నారు. ఆయన చివరి కోరికను తీర్చేందుకు అవకాశం ఇచ్చిన భారత సైన్యానికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఆఫ్ఘనిస్తాన్ తదితర దేశాలకు చెందిన మొత్తం 153 మంది క్యాడెట్లు సహా మరో 25 మంది ఈరోజు శిక్షణను పూర్తి చేసుకున్నట్లు భారత సైన్యం (indian army) చెప్పారు. వీరంతా పాసింగ్ ఔట్ పరేడ్‌లో కూడా పాల్గొన్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios