న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే సోమవారం నాడు ప్రమాణం చేశారు.రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్‌లో సోమవారం నాడు ఉదయం అరవింద్ బాబ్డేతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,  కేంద్ర హోంశాఖ  మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న రంజన్ గొగోయ్ ఆదివారం నాడు అధికారికంగా ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో చీఫ్ జస్టిస్‌గా బాబ్డే బాధ్యతలు చేపట్టారు. 2021 ఏప్రిల్ 23వ తేదీ వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.

17 మాసాల పాటు ఈ పదవిలో బాబ్డే కొనసాగుతారు. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామాలయ నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల తీర్మానం చేసింది.ఈ ధర్మాసనంలో  రంజన్ గొగోయ్‌ కూడ సభ్యులుగా ఉన్నారు. 

మహారాష్ట్రలో లాయర్ల కుటుంబం నుండి వచ్చిన జస్టిస్ బాబ్డే పేరును సీనియారిటీ ప్రాతిపదికపై రంజన్ గొగోయ్ ఇటీవల కేంద్రానికి సిఫారసు చేశారు. కేంద్రం సూచన మేరకు బాబ్డేను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా  నియమించారు. రిటైర్మెంట్‌కు ముందు పలు కీలకమైన కేసుల్లో రంజన్ గొగోయ్ సంచలన తీర్పులు చెప్పారు.