సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ వచ్చే నెల 9వ తేదీన నియామకం కానున్నారు. రాష్ట్రపతి నియమించబోతున్నట్టు న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు.
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ నవంబర్ 9వ తేదీన బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుత సీజేఐ యూయూ లలిత్ నవంబర్ 8వ తేదీన రిటైర్ కాబోతున్నారు. ఆయన తర్వాత సీజేఐగా నియమించడానికి జస్టిస్ చంద్రచూడ్‌ను జస్టిస్ యూయూ లలిత్ న్యాయ శాఖకు సిఫార్సు చేశారు. జస్టిస్ యూయూ లలిత్ తర్వాత సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్.
జస్టిస్ యూయూ లలిత్ సీజేఐగా కేవలం 74 రోజులే ఉంటున్నారు. కాగా, జస్టిస్ చంద్రచూడ్ సీజేఐగా రెండు సంవత్సరాలు కొనసాగనున్నారు. 2024 నవంబర్ 10వ తేదీన జస్టిస్ చంద్రచూడ్ రిటైర్ అవుతారు.
‘రాజ్యాంగం ఇచ్చే అధికారాల కింద రాష్ట్రపతి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు. 2022 నవంబర్ 9వ తేదీ నుంచి సీజేఐగా డీవై చంద్రచూడ్ ఉంటారు’ అని న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు.
Also Read: సుప్రీం కోర్ట్ ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారాలపై విచారణ నేడే..
జస్టిస్ చంద్రచూడ్ 2016, మే 13వ తేదీన సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు.అంతకు ముందు అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా 2013 అక్టోబర్ 31వ తేదీ నుంచి చేశారు. బాంబే హైకోర్టులో మార్చి 2000 నుంచి 2013 అక్టోబర్ మధ్య కాలంలో న్యాయమూర్తిగా పని చేశారు.
