సీజే ఎన్‌వీ రమణ సారథ్యంలోని కొలీజియం ముగ్గురు మహిళా న్యాయమూర్తులు సహా తొమ్మిది మందిని సుప్రీంకోర్టుకు పదోన్నతి కల్పించడానికి ప్రతిపాదనలు చేసింది. కేంద్రం ఆమోదం లభిస్తే వీరు త్వరలోనే సుప్రీంకోర్టులో సేవలందించనున్నారు. ఈ తొమ్మిది మందిలో కర్ణాటక హైకోర్టు నుంచి పదోన్నతి పొందుతున్న జస్టిస్ బీవీ నాగరత్న 2027లో తొలి మహిళా సీజేగా బాధ్యతలు చేపట్టే అవకాశముంది. ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మహిళా జడ్జీలు సేవలందించలేదు. 

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఒక మహిళా జస్టిస్ బాధ్యతలు తీసుకునే అవకాశముంది. సుప్రీంకోర్టుకు పదోన్నతి కల్పించడానికి కొలీజియం తొమ్మిది మంది న్యాయమూర్తుల పేర్లను రాష్ట్రపతికి ప్రాతిపాదించింది. రాష్ట్రపతి ఇందుకు సమ్మతం తెలిపితే త్వరలోనే తొమ్మిది మంది న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో సేవలందించనున్నారు. ఇందులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులున్నారు. సీనియారిటీ ప్రాతిపదికన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంపికవుతుంటారు. ఇదే రూల్ ప్రకారం, జస్టిస్ బీవీ నాగరత్న 2027లో సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకునే అవకాశముంది. తద్వారా తొలి మహిళా సీజేగా చరిత్ర సృష్టించనున్నారు. ఇప్పటి వరకు భారత ప్రధాన న్యాయమూర్తిగా మహిళా న్యాయమూర్తులకు అవకాశం దక్కలేదు. ఇప్పటి వరకు సుప్రీంకోర్టుకు కేవలం ఎనిమిది మంది మహిళలు ఎంపికవడం గమనార్హం. ప్రస్తుతం జస్టిస్ ఇందిరా బెనర్జీ ఒకరే బాధ్యతల్లో ఉన్నారు. ఆమె కూడా వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో రిటైర్ కానున్నారు.

జస్టిస్ బీవీ నాగరత్న ఎవరు?
జస్టిస్ బీవీ నాగరత్న ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన మాజీ సీజే ఈఎస్ వెంకటరామయ్య కూతురు. 1989 జూన్ నుంచి అదే ఏడాది డిసెంబర్ వరకు ఆయన సీజేఐగా కొనసాగారు. ఆమె కూతురు జస్టిస్ బీవీ నాగరత్న కూడా సీజేఐగా బాధ్యతలు తీసుకోవడానికి అవకాశాలున్నాయి.

1962 అక్టోబర్ 30న జన్మించిన జస్టిన్ నాగరత్న 1987 అక్టోబర్ 28న అడ్వకేట్‌గా బెంగళూరులో ఎన్‌రోల్ అయి ప్రాక్టీస్ మొదలుపెట్టారు. కాన్‌స్టిట్యూషనల్ లా, కమర్షియల్ లా, ఇన్సూరెన్స్ లా, సర్వీస్ లా, అడ్మినిస్ట్రేటివ్ అండ్ పబ్లిక్ లా సహా చాలా రంగాల్లో ఆమె ప్రాక్టీస్ చేసి నైపుణ్యం సాధించుకున్నారు.

2008 ఫిబ్రవరి 18న కర్ణాటక హైకోర్టుకు జస్టిస్ బీవీ నాగరత్న అదనపు న్యాయమూర్తిగా నియామకమయ్యారు. 2010 ఫిబ్రవరి 17న శాశ్వత న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. తాజాగా, ఆమెను సుప్రీంకోర్టుకు పదోన్నతి కల్పించడానికి సీజే ఎన్‌వీ రమణ సారథ్యంలోని కొలీజియం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలు అంగీకరిస్తే 2027లో జస్టిస్ బీవీ నాగరత్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే, ఆమె సుమారు నెల రోజులే సీజేఐగా కొనసాగే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది.

మరో ఇద్దరు మహిళా జడ్జీలు
జస్టిస్ బీవీ నాగరత్నతోపాటు మరో ఇద్దరు మహిళా న్యాయమూర్తులను సుప్రీంకోర్టు కొలీజియం తమ ప్రతిపాదనలో పేర్కొంది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, గుజరాత్ హైకోర్టు జడ్జీ జస్టిస్ బేలా త్రివేదిలున్నారు. ఈ ముగ్గురితోపాటు మరో ఆరుగురు న్యాయమూర్తులను కొలీజియం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించడానికి ప్రతిపాదనలు చేసింది. కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్ విక్రమ్ నాథ్, సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్
మహేశ్వరీ, కేరళ హైకోర్టు జడ్జీ సీటీ రవికుమార్, మద్రాస్ హైకోర్టు జడ్జీ ఎంఎం సుంద్రేశ్‌లతోపాటు బార్ నుంచి నేరుగా సీనియర్ అడ్వకేట్ పీఎస్ నరసింహాను నియమించడానికి ప్రతిపాదించింది.

సుప్రీంకోర్టు జడ్జీ ఆర్ఎఫ్ నారిమన్ ఈ నెల 12న రిటైర్ అయిన సంగతి తెలిసిందే. దీంతో సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య 25కు పడిపోయింది. మొత్తం 34వరకు సేవలందించడానికి అవకాశముంది. తాజా మాజీ సీజే జస్టిస్ ఎస్ఏ బాబ్డే హయాంలో ఒక్కరినీ సుప్రీంకోర్టుకు పదోన్నతి కల్పించలేదు.