Asianet News TeluguAsianet News Telugu

నెక్స్ట్ సీజేఐగా జస్టిస్ యూయూ లలిత్‌ను అపాయింట్ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ యూయూ లలిత్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్ చేశారు. 49వ సీజేఐగా ఆయన ఈ నెల 27వ తేదీన బాధ్యతలు తీసుకోనున్నారు. ఈ మేరకు న్యాయ  శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
 

justic UU Lalit appointed as next CJI by president Droupadi murmu
Author
New Delhi, First Published Aug 10, 2022, 7:19 PM IST

న్యూఢిల్లీ: జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ బుధవారం తదుపరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నియామకం అయ్యారు. సుప్రీంకోర్టు 49వ సీజేఐగా జస్టిస్ యూయూ లలిత్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్ చేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి ఓ ప్రకటన వెలువరించింది.

ప్రస్తుత సీజేఐ ఎన్వీ రమణ ఆగస్టు 26వ తేదీన పదవీ విరమణ పొందుతున్నారు. ఆ తర్వాత అంటే ఆగస్టు 27వ తేదీన భారత దేశ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్ బాధ్యతలు తీసుకుంటారు. 

రాజ్యాంగంలోని 124వ ఆర్టికల్, రెండో క్లాజు కింద సంక్రమించిన అధికారాలతో సుప్రీంకోర్టు న్యాయమూర్తి యూయూ లలిత్‌ను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నియమిస్తున్నట్టు న్యాయ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. జస్టిస్ యూయూ లలిత్ సీజేఐగా ఈ నెల 27వ తేదీన బాధ్యతలు తీసుకుంటారని వివరించింది.

అయితే, సీజేఐగా యూయూ లలిత్ చాలా స్వల్ప సమయం మాత్రమే ఉండనున్నారు. ఎందుకంటే.. నవంబర్ 8వ తేదీన ఆయన 65వ పడిలోకి వెళ్తున్నారు. అంటే.. నవంబర్ 8వ తేదీన ఆయన పదవీ విరమణ చెందుతారు. అంటే.. ఆయన 74 రోజులు మాత్రమే సుప్రీంకోర్టు సీజేఐగా బాధ్యతల్లో ఉంటారు.

సీజేఐ ఎన్వీ రమణ ఈ నెల 26న పదవీ విరమణ పొందుతారు. ఈ నేపథ్యంలోనే ఆయన తదుపరి సీజేఐగా జస్టిస్ యూయూ లలిత్ పేరును కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. 

జస్టిస్ లలిత్ గురించి..

జస్టిస్ యూయూ లలిత్ 1957 నవంబర్ 9వ తేదీన జన్మించారు. ఆయన లీగల్ కెరీర్‌ను 1983లో ప్రారంభించారు. 1985 డిసెంబర్ వరకు ఆయన బాంబే హైకోర్టులో పని చేశారు. అనంతరం ఆయన ఢిల్లీకి వెళ్లారు. 2004లో సుప్రీంకోర్టు ఆయనను సీనియర్ న్యాయవాదిగా అపాయింట్ చేసింది.

సీబీఐకి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఆయన సేవలు అందించారు. అనంతరం, బార్ ద్వారా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకం అయ్యారు. 2014 ఆగస్టు 13వ తేదీన ఆయన సుప్రీంకోర్టు జడ్జీగా నియామకం అయ్యారు.

Follow Us:
Download App:
  • android
  • ios