జూనియర్ డాక్టర్లు పీకల దాకా మందు తాగి.. చిందులు వేశారు. అది కూడా.. పూర్తిగా మద్యపాన నిషేధం అమలులో ఉన్న గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో చోటుచేసుకుంది.  కాగా... సమాచారం అందుకున్న పోలీసులు ఆ జూనియర్ డాక్టర్లను అరెస్టు చేయగా.. వారిలో ఐదుగురు యువతులు కూడా ఉన్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... గుజరాత్‌లో పూర్తి స్థాయిలో మద్య నిషేధం అమలులో ఉంది. బయటి రాష్ట్రాలు, దేశాలకు చెందిన వారికి సైతం అధీకృత లేఖ ఆధారంగా మాత్రమే పరిమితంగా మద్యం విక్రయిస్తారు. ఆ రాష్ట్రంలోని వడోదర రూరల్‌ పరిధిలో ఉన్న సుమన్‌దీన్‌ తోపాటు పాటు దీని అనుబంధ వైద్యశాల సుమన్‌దీప్‌ ఆస్పత్రిలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వారు విద్యనభ్యసిస్తున్నారు.

వీరిలో కొందరు సదరు ఆస్పత్రిలో పని చేసే జూనియర్‌ డాక్టర్లు కూడా ఉన్నారు. గుజరాత్‌లోని మీన్‌నగర్‌ ప్రాంతానికి చెందిన జైమన్‌ మెహతా, ఘట్లోడియా వాసి కిరణ్‌ మెహతా సైతం జూనియర్‌ డాక్టర్లుగా పని చేస్తున్నారు. తన సహచరులైన పది మందితో కలిసి మద్యం పార్టీ చేసుకోవాలని భావించారు. 

దీంతో ఆదివారం రాత్రి వడోదర రూరల్‌ పరిధిలోని ఆమోదర్‌ గ్రామంలో ఈ ద్వయం నివసించే శ్యామల్‌ కౌంటీలో ఉన్న హౌస్‌ నంబర్‌ 112 ఈ పార్టీకి వేదికైంది. ఇందులో ఐదుగురు యువతులు సహా 12 మంది జూనియర్‌ డాక్టర్లు మద్యం తాగుతున్నారు. ఈ విషయం గమనించిన చుట్టుపక్కల వాళ్లు కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించారు. 

దాడి చేసిన వఘోడియా పోలీసులు డజన్‌ మందినీ అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఆ ఇంటి నుంచి దేశీ, విదేశీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా.. అనంతరం ఆ జూనియర్ డాక్టర్లను బెయిల్ పై విడుదల చేశారు.