Asianet News TeluguAsianet News Telugu

జ్యూడీషియరీ వర్సెస్ కేంద్రం: ఏది సవ్యమైనదంటే.. కేంద్ర న్యాయ శాఖ మంత్రి లేటెస్ట్ కామెంట్ ఇదే

న్యాయమూర్తుల ఎంపిక విషయమై కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టుకు మధ్య ఘర్షణాయుత వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు కీలక కామెంట్ చేశారు. ఢిల్లీ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ఎస్ లోధి వ్యాఖ్యలను పోస్టు చేసిన కేంద్రమంత్రి తన కామెంట్‌ను ట్వీట్ చేశారు. దేశంలోని మెజార్టీ ప్రజలకు ఒకే విధమైన సవ్యమైన అభిప్రాయాలే ఉన్నాయని, కొందరు మాత్రమే తాము రాజ్యాంగానికి అతీతులం అనే భావనలో ఉన్నట్టు తనకు అనిపిస్తున్నదని వివరించారు.
 

judiciary vs government.. law minister kiren rijiju says it is the sane view
Author
First Published Jan 22, 2023, 2:13 PM IST

న్యూఢిల్లీ: న్యాయమూర్తుల ఎంపిక, రాజ్యాంగంలోని ఏ భాగాలను పార్లమెంటు మార్చవచ్చు అనే అంశాలపై అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు సుప్రీంకోర్టు మధ్య అంతర్లీనంగా ఒక ఘర్షణ జరుగుతున్నది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకడ్‌లు ఇప్పటికే న్యాయవ్యవస్థపై తమవైన అభిప్రాయాలు, సంస్కరణలు (మార్పులు)పై మాట్లాడారు. ఇటీవలే ప్రధానంగా న్యాయమూర్తుల ఎంపిక విషయంపై కేంద్రం నుంచి ఘాటు వ్యాఖ్యలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు కొలీజియం సరైన విధంగా పని చేస్తున్నదని న్యాయమూర్తులు చెబుతున్నారు. ఈ వాగ్యుద్ధంలో తాజాగా కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు మరో కామెంట్ చేశారు. ఏది సవ్యమైనది అనే విషయాన్ని పేర్కొన్నారు. ఇందుకు ఢిల్లీ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఆర్ఎస్ లోధి అభిప్రాయాన్ని ఆలంబనగా తీసుకున్నారు.

‘సుప్రీం కోర్టు తొలిసారి రాజ్యాంగాన్ని హైజాక్ చేసింది. మేమే న్యాయమూర్తులను ఎంపిక చేస్తామని వారు అంటున్నారు. ఇందులో ప్రభుత్వ పాత్ర ఏమీ ఉండదు’ అని ఆర్ఎస్ లోధి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కొలీజియం అటు హైకోర్టులకు, ఇటు సుప్రీంకోర్టులకు న్యాయమూర్తుల ఎంపిక సరికాదని అభిప్రాయపడ్డారు. ‘హైకోర్టులు సుప్రీంకోర్టుకు విధేయులు కావు. కానీ, హైకోర్టు న్యాయమూర్తులు మాత్రం సుప్రీంకోర్టు వైపు చూస్తారు. సుప్రీంకోర్టుకు విధేయంగా మెలుగుతారు’ అని ఆయన చెప్పారు. 

Also Read: భారత రాజ్యాంగంపై సీజేఐ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

ఈ వీడియో క్లిప్‌ను కిరణ్ రిజిజు ట్విట్టర్‌ హ్యాండిల్‌లో పోస్టు చేసి తన వ్యాఖ్యానాన్ని జోడించారు. ‘ఓ న్యాయమూర్తి గళం... భారత ప్రజాస్వామ్య సౌందర్యం దాని విజయంలోనే ఉన్నది. తమ ప్రతినిధులతో ప్రజలను ప్రజలే పాలించుకుంటున్నారు. ఎన్నికైన ప్రతినిధులు ప్రజల ప్రయోజనాలను, చట్టాలను రిప్రజెంట్ చేస్తారు. మన న్యాయవ్యవస్థ స్వతంత్రమైనదే, మన రాజ్యాంగమే అత్యున్నతమైనది (సుప్రీమ్)’ అని తెలిపారు.

‘నిజానికి, మెజార్టీ ప్రజలు ఒకే తరహా సవ్యమైన అభిప్రాయాలనే కలిగి ఉన్నారు. కానీ, రాజ్యాంగ నిబంధనలను ఖాతరు చేయని, ప్రజా తీర్పును లెక్క చేయని కొందరే తమను తాము భారత రాజ్యాంగానికి అతీతులం అని భావిస్తారని అనుకుంటున్నా’ అని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios