New Delhi: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ సీవో) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల 18వ సమావేశంలో భాగంగా శనివారం న్యూఢిల్లీలో జరిగిన 'స్మార్ట్ కోర్టులు, న్యాయవ్యవస్థ భవిష్యత్తు' కార్యక్రమంలో సీజేఐ డీవై చంద్రచూడ్ ప్రసంగించారు. పౌరులను చేరుకోవడానికి న్యాయవ్యవస్థ తప్పనిసరిగా సాంకేతికతను ఉపయోగించాలని అన్నారు.
Chief Justice of India (CJI) Dhananjaya Y Chandrachud: పౌరులకు చేరువయ్యేందుకు, అత్యవసర సేవగా న్యాయం అందించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని న్యాయవ్యవస్థ వినియోగించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ధనంజయ వై.చంద్రచూడ్ అన్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్ సీవో) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల 18వ సమావేశంలో భాగంగా శనివారం న్యూఢిల్లీలో జరిగిన 'స్మార్ట్ కోర్టులు, న్యాయవ్యవస్థ భవిష్యత్తు' కార్యక్రమంలో సీజేఐ ప్రసంగించారు. పౌరులను చేరుకోవడానికి న్యాయవ్యవస్థ తప్పనిసరిగా సాంకేతికతను ఉపయోగించాలని ఆయన అన్నారు.
ఇటీవల మూడో దశ ఈ-కోర్టుల ప్రాజెక్టుకు కేంద్రం నిధులు మంజూరు చేయడంతో, అందుబాటులో, సమర్థవంతమైన, పారదర్శక న్యాయవ్యవస్థను నిర్మించడంపై దృష్టి సారించి భవిష్యత్ న్యాయవ్యవస్థను రూపొందించే దిశగా ఈ-కోర్టులు అంకితభావంతో పనిచేస్తున్నాయని సీజేఐ డీవై చంద్రచూడ్ అన్నారు. మొదటి, రెండవ దశలు స్థానిక స్థాయిలో అవసరమైన డిజిటల్ మౌలిక సదుపాయాలను సృష్టించినందున, మూడవ దశ న్యాయ పంపిణీ వ్యవస్థకు పౌరులకు ప్రాప్యతను పెంచడానికి విధానాలను సులభతరం చేస్తుందని సీజేఐ అన్నారు. అన్ని ఈ-ఇన్షియేటివ్‌లు
కూడా డేటా ప్రొటెక్షన్ ఫ్రేమ్ వర్క్ ద్వారా నిర్వహించబడతాయనీ, గోప్యత ఆందోళనలకు సున్నితంగా ఉంటాయని పేర్కొన్నారు.
సీజేఐ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ.. "న్యాయం అనేది కేవలం సార్వభౌమ విధులు కాదనీ, అత్యవసర సేవ అని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏకాభిప్రాయం ఉంది. తదనుగుణంగా, స్మార్ట్ కోర్టుల రూపకల్పన ఈ మార్పును ప్రతిబింబించాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని పౌరులకు చేరుకోవడానికి, అత్యవసర సేవగా న్యాయం అందించడానికి ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగించాలి" అని అన్నారు. న్యాయవ్యవస్థ ప్రతి ఒక్కరికీ సకాలంలో, సమర్థవంతమైన న్యాయం అందేలా చూడాల్సిన అవసరాన్ని సీజేఐ నొక్కి చెప్పారు. ఆ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పౌరులకు, న్యాయ వ్యవస్థకు మధ్య అంతరాన్ని తగ్గించడం అనివార్యంగా మారిందన్నారు.
కోవిడ్ -19 మహమ్మారి ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపించినప్పటికీ.. న్యాయ సామర్థ్యం, న్యాయ ప్రాప్యత, సామాజిక న్యాయాన్ని పెంచడానికి మన న్యాయ సేవల యంత్రాంగాన్ని మౌలికంగా మార్చడానికి ఇది ఒక అవకాశాన్ని కల్పించిందని సీజేఐ తెలిపారు. సాంకేతికతను మరింతగా ఉపయోగించే పరిస్థితులను కల్పించిందని పేర్కొన్నారు. ఈ-కోర్టు సేవలను అందించడానికి వన్ స్టాప్ సెంటర్ లాంటి దాదాపు 4 లక్షల కామన్ సర్వీస్ సెంటర్ల నెట్ వర్క్ ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని పౌరులకు ఈ-ఫైలింగ్, కోర్టు ఫీజుల ఈ-పేమెంట్ వంటి కోర్టు ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి.
మహమ్మారి సమయంలో భారతదేశంలో డిజిటల్ విభజన కారణంగా, ఇ-కోర్ట్స్ ప్రాజెక్టు మొదటి రెండు దశలు సాంకేతిక చొరవలు ఎవరినీ మినహాయించకుండా చూడటానికి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశాయని సీజేఐ చెప్పారు. శుక్రవారం ప్రారంభమైన మూడు రోజుల కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్ కూడా హాజరవుతున్నారు.
