జార్ఖండ్‌లోని గొడ్డాలో ఓ ప్రత్యేకమైన ప్రేమకథ తెరపైకి వచ్చింది. ఈ ప్రేమకథలో వ్య‌క్తులు సాధార‌ణ‌మైన వారు కాదు.ఒకరు జడ్జి కాగా..  మ‌రొకరు లాయర్, ఇరువురు ఒక్క‌రినొక్క‌రూ ఇష్ట‌ప‌డి పెళ్లి చేసుకున్నాడు. న్యాయమూర్తి వయస్సు 64 ఏళ్లు కాగా, మహిళా న్యాయవాది వయస్సు 50. న్యాయమూర్తి వచ్చే ఏడాది పదవీ విరమణ చేయనున్నారు.

దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు శిక్ష విధించిన న్యాయమూర్తి శివపాల్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. పదవీ విరమణ చేసే వయసులో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిస్తున్నారు. 64 ఏళ్ల న్యాయమూర్తి శివపాల్ సింగ్ ప్రేమించి రెండో వివాహం చేసుకున్నారు. ఆయ‌న‌ తన పదవీ విరమణకు ఆరు నెలల ముందు పరస్పర, కుటుంబ సమ్మతితో నూతన్ తివారీ (50) అనే న్యాయవాదిని వివాహం చేసుకున్నారు.

సమాచారం ప్రకారం.. నూతన్ తివారీకి గతంలో వివాహం జరిగింది, అయితే ఆమె భర్త అకాల మరణం చెందాడు. ఆమెకు ఒక బిడ్డ కూడా ఉంది. న్యాయమూర్తి శివ్‌పాల్‌ భార్య కూడా 2006లో కన్నుమూశారు. ఆయ‌న‌కు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. భార్యను కోల్పోయిన న్యాయమూర్తి త‌న‌కు ఓ తోడు కావాల‌నుకున్నాడు. ఈ క్ర‌మంతో న్యాయవాది నూతన్ తివారీతో అభిప్రాయాలు క‌లువ‌డంతో ఒకరికొకరు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల స‌మ్మ‌తితో ఇద్దరూ హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.

జడ్జి శివపాల్ సింగ్ తన కెరీర్‌లో చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారని, అయితే అతను తన ప్రేమకు సంబంధించి 64 ఏళ్ల వయస్సులో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ప‌లువురు అంటున్నారు. కాగా, ఇది ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత నిర్ణయమని న్యాయమూర్తి శివపాల్ సింగ్ పేర్కొన్నారు.

శివపాల్ సింగ్ సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలోనే నూతన్ తివారీతో శివపాల్‌కు సాన్నిహిత్యం ఏర్పడింది. గొడ్డా కోర్టు ప్రాంగణంలో న్యాయమూర్తి శివపాల్ సింగ్, న్యాయవాది నూతన్ తివారీ ప‌నిచేశారు. ఇద్దరి మధ్య పరిచయం పెళ్లికి దారితీసింది.

దాణా కుంభకోణం కేసుకు సంబంధించి దేవఘర్ ట్రెజరీ నుంచి అక్రమ ఉపసంహరణ కేసును న్యాయమూర్తి శివపాల్ సింగ్ విచారించడం గమనార్హం. న్యాయమూర్తి శివపాల్ సింగ్ అప్పట్లో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. విచారణ సందర్భంగా కోర్టులో లాలూ యాదవ్, న్యాయమూర్తి శివపాల్ సింగ్ మధ్య జరిగిన సంభాషణ అప్పట్లో వార్తల్లో నిలిచింది.