న్యూఢిల్లీ:బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్ పై గురువారం నాడు పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో రాళ్ల దాడి జరిగింది. టీఎంసీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది.

గురువారం నాడు మధ్యాహ్నం దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకొంది. జేపీ నడ్డా, జాతీయ కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ, బీజేపీ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఇతర నేతలు డైమండ్ హర్బర్ వద్ద సమావేశానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది.

ఈ దాడిలో కొన్ని మీడియా సంస్థలకు చెందిన వాహనాలు కూడ ధ్వంసమయ్యాయి. డైమండ్ హార్బర్ నుండి సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 

కొన్ని రోజులుగా సీఎంతో పాటు అబిషేక్ పై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.ఈ రాళ్లదాడిలో పలు వాహనాల కిటీకీల అద్దాలు ధ్వంసమయ్యాయి. బీజేపీ జాతీయ కార్యదర్శి అనుపమ్ హజ్రా రాళ్ల దాడిలో గాయపడ్డాడు. నడ్డా కార్యక్రమాన్ని విఫలం చేయడానికి ఈ దాడి చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. డైమండ్ హార్బర్ కు కోల్ కతాను అనుసంధానించే రహదారి వెంట పోలీసులు లేకపోవడంతోనే దుండగులు రాళ్ల దాడికి దిగారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.

తాను బుల్లెట్ ఫ్రూప్ కారులో ఉన్నందున తనకు గాయాలు కాలేదని జేపీ నడ్డా కార్యకర్తల సమావేశంలో చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేసే మనస్తత్వాన్ని అణచివేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో మీ సహకారం ఆశీర్వాదం అవసరమని ఆయన చెప్పారు. ఈ ప్రభుత్వాన్ని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రిషి అరబిందో వదిలిపెట్టిన సంస్కృతి ఇదేనా అని ఆయన ప్రశ్నించారు.

గత నెలలో 8 మంది బీజేపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. 130 మందికి పైగా బీజేపీ కార్యకర్తలు ఇటీవల కాలంలో హత్య చేయబడ్డారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పాలన లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో తమ పార్టీ కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోగలనని చెప్పారు.

రాష్ట్రంలో ప్రజలను బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా బుధవారం నుండి రెచ్చగొడుతున్నాడని బెంగాల్ పంచాయితీరాజ్ శాఖ మంత్రి సుబ్రత ముఖర్జీ ఆరోపించారు.

ఇవాళ జరిగిన ఘటనపై  విచారణ జరుపుతామన్నారు. ఈ ఘటన వెనుక  తమ వారున్నా చర్యలు తీసుకొంటామన్నారు. బీజేపీవారున్నా చర్యలు తప్పవన్నారు. ఇతర రాష్ట్రాల్లో తమ వారితోనే బీజేపీ ఇలా దాడులు చేయించుకొందని ఆయన ఆరోపించారు.