ఉత్తరప్రదేశ్‌లో మద్యం మాఫియా రెచ్చిపోయింది. తమ కార్యకలాపాలకు అడ్డొస్తున్నారనే కక్షతో ఓ జర్నలిస్ట్ ఆయన సోదరుడిని లిక్కర్ మాఫియా కాల్చి చంపింది. ప్రముఖ హిందీ వార్తాపత్రికలో పనిచేసే జర్నలిస్ట్ ఆశిస్ జన్వాని, ఆయన సోదరుడికి లిక్కర్ మాఫియా నుంచి పలుమార్లు బెదిరింపులు వచ్చాయి.

దీనిపై వారు పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం గుర్తు తెలియని దుండగులు ఆశిష్, ఆయన సోదరుడిపై ఆదివారం అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు.

ఈ ఘటనలో జర్నలిస్ట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించగా.. ఆయన సోదరుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. జర్నలిస్ట్ సోదరుల హత్యపై స్థానికులు భగ్గుమన్నారు. పోలీసులు సరైన సమయంలో స్పందించివుంటే ఇంత దారుణం జరిగేది కాదని మండిపడ్డారు.

విషయం తెలుసుకున్న డీజీపీ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మృతులకు రూ.5 లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించింది యూపీ ప్రభుత్వం.