New Delhi: గూఢచర్యం కేసులో జర్నలిస్ట్, నేవీ మాజీ కమాండర్ అరెస్ట్ అయ్యారు. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ వివేక్ రఘువంశీ, నేవీ మాజీ కమాండర్ ఆశిష్ పాఠక్ లపై అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదైంది. అంతకుముందు, కొన్ని దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపే 'భారీ కుట్ర' దర్యాప్తులో భాగంగా ఆయా అంశాలతో సంబంధం ఉన్న ప్రాంగణాలతో సహా 12 చోట్ల సీబీఐ దాడులు నిర్వహించింది.
espionage case: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) ప్రాజెక్టులు, సాయుధ దళాల భవిష్యత్ కొనుగోళ్ల వివరాలతో సహా సున్నితమైన సైనిక సమాచారాన్ని శత్రు దేశాలకు చేరవేసినందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, మాజీ నేవీ కమాండర్ ను అరెస్టు చేసింది. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ వివేక్ రఘువంశీ, నేవీ మాజీ కమాండర్ ఆశిష్ పాఠక్లపై గూఢచర్యం, రహస్య సమాచారాన్ని లీక్ చేశారనే ఆరోపణలతో కూడిన అధికారిక రహస్యాల చట్టం (ఓఎస్ఏ), భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 120 బి (నేరపూరిత కుట్ర) కింద కేసు నమోదు చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. వారిని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా ప్రత్యేక న్యాయమూర్తి 6 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగించినట్లు అధికారులు తెలిపారు.
కొన్ని దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందనీ, భారీ కుట్ర దర్యాప్తులో భాగంగా రఘువంశీ, పాఠక్ లతో సంబంధం ఉన్న 12 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించింది. జర్నలిస్ట్, నావికాదళ అధికారిని మంగళవారం సాయంత్రం విచారించామనీ, ఓఎస్ఏ కింద అదుపులోకి తీసుకున్నామని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. ఈ సోదాల్లో రఘువంశీ తదితరులకు చెందిన ల్యాప్ టాప్ లు, టాబ్లెట్లు, మొబైల్ ఫోన్లు, హార్డ్ డిస్క్ లు, పెన్ డ్రైవ్ సహా 48 ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ తెలిపింది. అంతేకాకుండా భారత రక్షణ సంస్థలకు సంబంధించిన పలు కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.
నిందితుడు, అతని సహచరుడు (మాజీ నేవీ కమాండర్, ప్రస్తుతం ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారు) భారత రక్షణ సంస్థలకు సంబంధించిన రహస్య పత్రాలను కలిగి ఉన్నారని ఆరోపించారు. నిందితుల వద్ద నుంచి ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న పరికరాలను పరిశీలించగా నిందితుడు వివిధ వనరుల నుంచి భారత రక్షణ కొనుగోళ్లకు సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరిస్తున్నాడని, పలు విదేశీ సంస్థలు/ ఏజెంట్లు/ వ్యక్తులతో సంప్రదింపులు జరుపుతున్నాడని, రహస్య సమాచారాన్ని పంచుకోవడానికి పలు విదేశీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడైందని సీబీఐ వర్గాలు తెలిపాయి. రఘువంశీ, ఆయన కుటుంబ సభ్యులు విదేశాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు అందుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రఘువంశీ, ఆయన కుటుంబ సభ్యులకు సుమారు రూ.3 కోట్లు అందాయని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు.
గత ఏడాది డిసెంబర్ 9న దీనిపై కేసు నమోదు చేసిన ఫెడరల్ ఏజెన్సీ లీకేజీలపై దర్యాప్తు చేపట్టింది. ఈ కేసు దర్యాప్తును తొలుత ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ప్రారంభించినప్పటికీ అంతర్జాతీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకుని సీబీఐకి అప్పగించింది. రఘువంశీ తదితరులు శత్రు దేశాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు సమాచారాన్ని చేరవేస్తున్నారని హెచ్టీ చూసిన ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. సమాచారం ప్రకారం, ఇది ఒక అంతర్జాతీయ నెట్వర్క్, దీనిలో కొంతమంది భారతీయ పాత్రికేయులు పైన పేర్కొన్న వ్యూహాత్మక / రహస్య సమాచారాన్ని విదేశీ శత్రు దేశాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు సరఫరా చేస్తున్నారు" అని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. జైపూర్ కు చెందిన రఘువంశీ అమెరికాకు చెందిన ఓ న్యూస్ పోర్టల్ కు రక్షణ, అంతరిక్ష తయారీ అభివృద్ధిపై కథనాలు అందించారు.
ఈ దర్యాప్తులో అంతర్జాతీయంగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని పేరు వెల్లడించడానికి ఇష్టపడని మరో అధికారి తెలిపారు. రక్షణ ప్రాజెక్టులకు సంబంధించిన ఎంత డేటా లేదా సమాచారాన్ని పంచుకున్నారో తెలుసుకోవాలన్నారు.
