న్యూఢిల్లీ: తన కుటుంబానికి అత్యంత ఆప్తుడైన లాలూప్రసాద్ యాదవ్ సలహా మేరకు తాను కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా సినీ నటుడు,  శతృఘ్నసిన్హా ప్రకటించారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.

తనను  తమ పార్టీల్లో చేరాల్సిందిగా తృణమూల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ మమతా బెనర్జీ, సమాజ్‌వాదీపార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌లు తమ తమ పార్టీల్లో చేరాల్సిందిగా తనను ఆహ్వానించారని తెలిపారు.  సుదీర్ఘకాలం పాటు బీజేపీలో ఉన్న తాను ఆ పార్టీని వీడడం బాధగా ఉందన్నారు.

ఈ ఎన్నికల్లో తాను పాట్నా నుండి పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు.  2014 ఎన్నికల్లో పాట్నా సాహిబ్‌లో తన స్వశక్తితోనే విజయం సాధించినట్టుగా శతృఘ్నసిన్హా చెప్పారు.  ఆ ఎన్నికల్లో పార్టీ నుండి తనకు ఎలాంటి సహాయం లభించలదేన్నారు.

మోడీ, అమిత్ షా నాయకత్వంలో దేశంలో నియంతృత్వం కొనసాగుతోందని ఆయన విమర్శించారు. వాజ్‌పేయ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో  అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకొనేవారని ఆయన చెప్పారు. వారం రోజుల క్రితం సిన్హా రాహుల్‌తో సమావేశమయ్యారు. ఏప్రిల్ 6వ తేదీన శతృఘ్నసిన్హాకాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలనే తన నిర్ణయంతో తన కుటుంబానికి ఆప్తుడైన లాలూ కూడ సమర్ధించారని ఆయన వివరించారు.