Asianet News TeluguAsianet News Telugu

జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ అమ్మకాలకు ఫుల్‌స్టాప్! వచ్చే ఏడాది నుంచి నిలిపివేత

జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ అమ్మకాలు 2023 నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్నాయి. ఈ బేబీ పౌడర్ క్యాన్సర్ కారకాలతో కలుషితమై ఉన్నదని పలు దావాలు ఈ కంపెనీపై దాఖలయ్యాయి. ఈ కారణంగా సేల్స్ పడిపోవడంత 2020లో అమెరికా, కెనడాలో అమ్మకాలు నిలిపేసింది.
 

johnson and johnson baby powder firm to stop sales from 2023 globally
Author
New Delhi, First Published Aug 12, 2022, 1:20 PM IST

న్యూఢిల్లీ: జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ గురించి తెలియనివారు చాలా తక్కువ. ఒకప్పుడు ఎక్కడ ప్రసవం జరిగినా.. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్లు ప్రత్యక్షం అయ్యేవి. ఇప్పటికీ ఈ పౌడర్ వాడుతుంటారు. కానీ, ఈ పౌడర్ అమెరికాలో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ పౌడర్‌లో క్యాన్సర్‌కు కారకమైన ఆస్‌బెస్టాస్ ఉన్నదని చాలా మంది వాదించారు. వేల కొద్దీ దావాలు న్యాయస్థానాల్లో పడ్డాయి. దీంతో ఈ సంస్థ ప్రతినిధులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. చివరకు అమెరికాలో ఈ బేబీ పౌడర్ అమ్మకాలు నిలిపేశారు. రెండు సంవత్సరాలకు పైగా కాలం గడిచిన తర్వాత  మొత్తంగానే ఈ బేబీ పౌడర్ అమ్మకాలు నిలిపేయాలని ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. 2023 నుంచి ప్రపంచవ్యాప్తంగా జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ అమ్మకాలు నిలిపేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా పోర్ట్‌ఫోలియోను సమీక్షించే కార్యక్రమంలో భాగంగా తాము ఒక కమర్షియల్ నిర్ణయం తీసుకున్నామని ఆ సంస్థ తెలిపింది. కార్న్ స్టార్చ్ ఆధారిత పౌడర్‌ను ఉత్పత్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. కార్న్ స్టార్చ్ ఆధారిత బేబీ పౌడర్‌‌ను ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు జరుపుతున్నారని తెలిపింది. 2023 నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత బేబీ పౌడర్‌ అమ్మకాలను నిలిపేస్తామని  గురువారం ఈ సంస్థ వెల్లడించింది.

తమ ప్రాడక్ట్ గురించి తప్పుడు సమాచారం వ్యాపించిన తర్వాత సేల్స్ పడిపోయాయని ఈ సంస్థ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే అమెరికా, కెనడాల్లో జే అండ్ జే బేబీ పౌడర్‌ అమ్మకాలను నిలిపేస్తున్నట్టు 2020లో ప్రకటించింది. 

క్యాన్సర్ కారకం ఆస్‌బెస్టాస్‌తో జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్‌లో చేరిందని, తద్వార పలువురు క్యాన్సర్ బారిన పడ్డారని సంస్థపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్యాన్సర్ కారకం అనే అంశంతో కోర్టుల్లో సుమారు 38 వేల దావాలు దాఖలు అయ్యాయి. తమ ఉత్పత్తిలో ఆస్‌బెస్టాస్ లేదని ఆ సంస్థ వాదిస్తూ వచ్చింది. ఈ దావాల కారణంగా సంస్థ బిలియన్ డాలర్లు నష్టపోయింది. దావా వేసిన వారితో సెటిల్‌మెంట్ల కోసం భారీ మొత్తాలను సంస్థ చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే సంస్థ దివాళా ప్రకటించింది.

Follow Us:
Download App:
  • android
  • ios