ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ) ఇటీవల చోటుచేసుకున్న హింసపై వర్సిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ శాంతిశ్రీ దూళిపూడి పండిట్ స్పందించారు. దానిని దురదృష్టకరమైన ఘటనగా పేర్కొన్నారు. 

ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్‌యూ) ఇటీవల చోటుచేసుకున్న హింసపై వర్సిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ శాంతిశ్రీ దూళిపూడి పండిట్ స్పందించారు. దానిని దురదృష్టకరమైన ఘటనగా పేర్కొన్నారు. ఓ ఆంగ్ల మీడియాతో ఆమె మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయంలో ఆహార ఎంపికలలో ఎటువంటి సమస్య లేదని తెలిపారు. వర్సిటీలోని ప్రతి ఒక్కరికి కావాల్సింది తినడానికి, వారు కోరుకున్నది ధరించడానికి స్వాతంత్ర్యం ఉంటుందని చెప్పారు. యూనివర్సిటీ రెస్లింగ్ చేయడానికి వేదిక కాదని, రాజకీయాలకు వేదిక కాదని ఆమె స్పష్టం చేశారు. అలా చేయాలని అనుకుంటే ఎన్నికల్లో పోటీ చేయాలని.. వారి రాజకీయ జీవితానికి జేఎన్‌యూ ఎలాంటి సహాయం చేయవదని అన్నారు. 

వర్సీటీలో చోటుచేసుకున్న ఘర్షణను ఖండించిన వైఎస్ చాన్స్‌లర్.. జేఎన్‌యూ సరస్వతి నిలయం.. దయచేసి ఇక్కడ కేవలం చదువుకోవాలని విద్యార్థులను కోరారు. విద్యపరంగా చర్చలు చేయాలని, విద్యాపరంగా పోరాడాలని సూచించారు. 

‘‘ముందు మేధావులు అవ్వండి.. ఆ స్థాయిలో నాయకుడిగా ఉండండి. మేము ఇప్పటికీ అత్యుత్తమ విశ్వవిద్యాలయం. 95 శాతం JNU విద్యార్థులు దేశానికి సేవ చేస్తున్నారు. మరో 5 శాతం విద్యార్థులను కూడా మేము కలిగి ఉన్నామని అంగీకరిస్తున్నాను. కానీ మేము ఉత్తమమైన ఆలోచనలను కూడా ఇచ్చామని నేను భావిస్తున్నాను. విదేశాంగ మంత్రి, ఆర్థిక మంత్రి.. చాలా మంది IAS అధికారులు JNU నుండి వచ్చారు. ఈ విశ్వవిద్యాలయం నన్ను నన్నుగా మార్చింది’’ వైఎస్ చాన్స్‌లర్ అన్నారు. అంతే కాకుండా ప్రతి విశ్వవిద్యాలయం ఒక వెర్రి మూకను కలిగి ఉంటుందని అన్నారు. JNU దీనికి మినహాయింపు కాదని చెప్పారు. 

భారతదేశంలో JNU అత్యంత స్వేచ్ఛాయుత ప్రదేశం అని వైఎస్ చాన్స్‌లర్ పేర్కొన్నారు. మెస్‌ను విద్యార్థులే నడుపుతున్నారని.. అందులో పరిపాలన విభాగానికి ఎటువంటి పాత్ర లేదని స్పష్టం చేశారు. భోజనంలో ఏమేమి ఉండాలో కమిటీనే నిర్ణయిస్తుందన్నారు. ‘‘16 హాస్టళ్లలో ఏమీ జరగలేదు.. అక్కడ నాన్ వెజ్ ఆహారం కూడా ఉంది. ఒక్క హాస్టల్‌లో మాత్రమే ఈ సమస్య ఎందుకు వచ్చింది. ఇఫ్తార్ పార్టీ, హోం రెండు అదే స్థలంలో జరుగుతున్నాయి. తొలుతది వారం రోజులుగా జరిగింది.. రామనవమి సంబంధించి ఈ అభ్యంతరం ఎందుకు?. కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా నాకు చెప్పారు. అయితే ఇవన్నీ వివరణలు మాత్రమే. నేను విచారణకు ఆదేశించాను. విచారణ తర్వాత మాత్రమే వాస్తవాలను నిర్దారించగలం’’ అని వైఎస్ చాన్స్‌లర్ చెప్పారు. 


‘‘హిందువుల మతపరమైన భావాలకు అనుగుణంగా హోమం పూర్తయ్యే వరకు మాంసాహారం వండకూడదని విద్యార్థులు తమలో తాము చెప్పుకున్నారు. మిగతా హాస్టళ్లలో మాంసాహారం ఉంది.. అక్కడ అలాంటి సమస్యేమీ తలెత్తలేదు. మెస్ సెక్రటరీ ఇప్పటి వరకు నాకు ఎలాంటి అధికారిక నివేదిక ఇవ్వలేదు.. వార్డెన్లు మాత్రమే ఇచ్చారు. మేము ప్రోకోటోరల్ విచారణ జరుపుతున్నాం’’ అని వైఎస్ చాన్స్‌లర్ తెలిపారు. 

ఇక, దీనిని ముందస్తు ప్రణాళితో జరిగిన దాడిన అని వైఎస్ చాన్స్‌లర్ పేర్కొన్నారు. క్యాంపస్‌లో హింసను సహించబోమని.. ఈ ఘర్షణలో ప్రమేయం ఉన్నవారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘‘మా అడ్మినిస్ట్రేషన్ హింసను సహించదు. ఆ రోజు సాయంత్రం 4:30 గంటలకు ఫుడ్ ఫాసిజం గురించి నాపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. ఫాసిజం ఎక్కడ ఉంది?. ఓ గ్రూప్ విద్యార్థులు మొదట ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేశారు. ఆ తర్వాత మరో గ్రూప్ కూడా పోలీసు స్టేషన్‌కు వెళ్లింది.. దయచేసి వాస్తవాలు బయటకు వచ్చే వరకు వేచి ఉండండి’’ అని వైఎస్ చాన్స్‌లర్ చెప్పారు.