ధన్‌బాద్: జేఎంఎంకి చెందిన సీనియర్ నేత, ఆయన భార్యను గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం నాడు దారుణంగా హత్య చేశారు. రాష్ట్ర రాజధాని రాంచీకి 150 కి.మీ దూరంలో ఈ ఘటన చోటు చేసుకొంది.

జేఎంఎం సీనియర్ నేత శంకర్ రావని, అతని భార్య బాలికా దేవిలను ఇవాళ ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. తుపాకీతో కాల్చడంతో పాటు కత్తితో ఇద్దరిపై దాడి చేసినట్టుగా గాయాలను గుర్తించారు పోలీసులు.

సంఘటన స్థలంలో 9 ఎంఎం ఫిస్టల్ కు చెందిన బుల్లెట్లు, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.  రావని జేఎంఎం ధన్ బాద్ సిటీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఆదివారం నాడు ఉదయం ఈ ఘటన చోటు చేసుకొందని పోలీసులు చెప్పారు.

సంఘటన స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాల కోసం సేకరిస్తున్నారు. ఈ కుటుంబంతో పాత కక్షలు ఉన్నవారే  ఈ ఘటనకు పాల్పడినట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఉదయం పూట భారీ శబ్దాలు రావడంతో జేఎంఎం నేత ఇంటి వద్దకు వెళ్లిన స్థానికులకు ఈ హత్య విషయం వెలుగు చూసింది.