ప్రధాని నరేంద్ర మోడీపై ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ చేసిన విమర్శలను ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఖండిస్తూ చేసిన ట్వీట్లతో దేశంలో రాజకీయం వేడెక్కింది. సోరేన్ వ్యాఖ్యలపై దేశంలో మరే ఏ ఇతర ముఖ్యమంత్రి ఖండించకపోయినా జగన్ స్పందించడం పెద్ద దుమారం రేపుతోంది.

జగన్ ట్వీట్‌పై హేమంత్ సోరేన్ పార్టీ... ఝార్ఖండ్ ముక్తి మోర్చా సైతం ఘాటుగానే స్పందించింది. మీ నిస్సహాయత గురించి దేశం మొత్తం తెలుసంటూ జగన్‌కు చురకలంటించింది. అంతేకాదు, మేము కూడా నిన్ను అభిమానించి, గౌరవిస్తున్నామని, మీరు ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నామంటూ సెటైర్లు వేసింది.

Also Read:మోడీపై విమర్శలు: హేమంత్ సొరేన్ కు వైఎస్ జగన్ కౌంటర్

అలాగే స్వప్రయోజనాల కోసమే చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్‌ బీజేపీకి దగ్గరవుతున్నారని జేఎంఎం విమర్శించింది. అలాగే ఏపీకి కేంద్రం నుంచి పూర్తి మద్దతు అందుతోందని తెలిపింది. కానీ, కేంద్రం వైఖరితో చాలా రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయని.. జగన్‌ కంటే ఝార్ఖండ్‌ సీఎంకి ఎంతో పరిణతి ఉందని జేఎంఎం ప్రధాన కార్యదర్శి సుప్రియో భట్టాచార్య ట్వీట్ చేశారు. 

కాగా, కరోనా కష్టకాలంలో  రాష్ట్రాల ముఖ్యమంత్రుల సూచనలు, సలహాలను ప్రధాని మోడీ వినడం లేదంటూ ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌  ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం జగన్‌ స్పందిస్తూ.. ఇది కొవిడ్‌పై యుద్ధంలో వేలెత్తి చూపే సమయం కాదని.. ప్రధానికి అండగా నిలవాల్సిన సమయమని హేమంత్‌ సోరెన్‌కు హితవు పలికారు. దీనిపై తాజాగా జేఎంఎం కౌంటర్‌ ఇవ్వడం విశేషం. మరి దీనికి జగన్, వైసీపీలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.