జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గిరీశ్ చంద్ర మర్ము బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం ఆయన తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి పంపించినట్లు తెలుస్తోంది. లెఫ్టినెంట్ గవర్నర్ గా రాజీనామా చేసి.. ఆయన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్)గా నియమితులవుతారని సమాచారం. ప్రస్తుత కాగ్ రాజీవ్ మెహ్రిషి ఈ వారంలో పదవి విరమణ పొందనున్నారని, ఆయన స్థానంలో ముర్ము నియమితులు అవుతారని తెలిసింది.

సరిగ్గా సంవత్సరం క్రితం జమ్మూకశ్మీర్ కి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అలా రద్దు చేసిన తర్వాత జమ్మూకాశ్మీర్ తొలి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా ముర్ము గత అక్టోబర్‌లో నియమితులయ్యారు. జమ్మూకాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 కింద జమ్మూకాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన విషయం తెలిసిందే. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి ఏడాది కావస్తున్న ఆగస్టు 5 రోజునే ముర్ము తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.