మహాబలిపురం: చైనాలోని వుహాన్ నగరంలో జరిగిన తొలి భేటీ తరువాత చైనా అధ్యక్షుడు భారత్ లోని మహాబలిపురం లో పర్యటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ అనధికారిక పర్యటనను చెన్నై కనెక్ట్ పేరుతో వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే. 

రెండు రోజుల పాటు సాగనున్న ఈ భేటీకోసం నిన్న శుక్రవారం నాడు పల్లవుల నగరం మామల్లాపురం చేరుకున్న జిన్ పింగ్ శనివారం ప్రధాని మోడీతో విస్తృతమైన చర్చలు జరపనున్నారు. 

ప్రధాని నరేంద్రమోడీ నిన్న శుక్రవారం రాత్రి ఇచ్చిన విందులో ఘుమఘుమలాడే దక్షిణాది వంటకాలను వడ్డించారు. తంజావూర్ కోడి కర్రీ నుంచి మలబార్ లోబ్స్టర్ వరకు దక్షిణాది వంటకాలతో నోరూరించే విందును వడ్డించారు. 

వీటితోపాటు కరివేపాకుతో వండే చేపల కూర కరివేపిళ్ళై మీన్ వరువాల్, మసాలా దినుసులు కొత్తిమీర దట్టించి వండే మాంసం కూర యెరచి మటన్ కొరంబు, మాంసం బిర్యానీ, తక్కాళి రసం లతో కూడిన నోరూరించే వంటకాలతో జిన్ పింగ్ కు అదిరిపోయే విందు భోజనాన్ని ఏర్పాటు చేసారు.

ఈ పల్లవుల నగరాన్ని ఇరుదేశాధినేతల సమావేశానికి వేదికగా ఎంచుకోవడానికి కారణం కూడా లేకపోలేదు. చైనా సిల్క్ రూట్ లో ఈ పల్లవుల రాజధాని మామల్లాపురానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడి నుండి దక్షిణాసియా దేశాలకు ఎగుమతులు, అక్కడినుంచి దిగుమతులు జరిగేవి.    

భారత ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్టు ఇరు దేశాల మధ్య స్నేహపూర్వకమైన వాతావరణంలో చర్చలు సాగాయని, ఇవి ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత దృఢపరుస్తాయన్న అభిప్రాయాన్ని జిన్ పింగ్ వెలిబుచ్చారు.