జార్ఖండ్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన సొంత కుటుంబసభ్యులను చంపి, అనంతరం ఇంటికి నిప్పంటించాడు. వివరాల్లోకి వెళితే...  సరాయ్‌కేలా జిల్లాకు చెందిన చిన్నూసోరెన్ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి పీకలదాకా మద్యం సేవించి అనంతరం తన పొరుగింట్లో నిద్రపోయాడు.

అయితే వేకువజామున తన ఇంటిలోకి వెళ్లి పదునైన ఆయుధంతో సోదరుడిపై దాడి చేసి చంపేశాడు. అనంతరం సోదరుడి భార్య, ముగ్గురు పిల్లలను అత్యంత కిరాతకంగా చంపేశాడు.

వారితో పాటు తన తల్లి, మరో సోదరుడిపైనా దాడి చేసి ఇంటికి నిప్పంటించాడు. దాడిని వెంటనే పసిగట్టిన స్థానికులు మంటలను అదుపు చేసి అనంతరం తీవ్రంగా గాయపడిన అతడి తల్లి, సోదరుడిని ఆస్పత్రిలో చేర్పించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. చిన్నూసోరెన్ మానసిక పరిస్థితి గత కొంతకాలంగా సరిగా లేదని గ్రామస్తులు తెలిపారు. అయితే హత్యల వెనుక ఉన్న కారణాలు తెలియాల్సి ఉంది.