Asianet News TeluguAsianet News Telugu

ధన్‌బాద్ జిల్లా జడ్జి హత్య కేసు.. నిందితులను తప్పించాలని చూస్తున్నారా: సీబీఐపై ఝార్ఖండ్ హైకోర్టు ఆగ్రహం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధన్‌బాద్ జిల్లా జడ్జి (Dhanbad district court judge) ఉత్తమ్ ఆనంద్ ( Uttam Anand) హత్యపై ఝార్ఖండ్ హైకోర్టు ( Jharkhand High Court ) సంచలన వ్యాఖ్యలు చేసింది. 

Jharkhand High Court slams CBI on Dhanbad judge murder case
Author
Dhanbad, First Published Jan 23, 2022, 2:40 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ధన్‌బాద్ జిల్లా జడ్జి (Dhanbad district court judge) ఉత్తమ్ ఆనంద్ ( Uttam Anand) హత్యపై ఝార్ఖండ్ హైకోర్టు ( Jharkhand High Court ) సంచలన వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తిని హతమార్చిన నిందితులను కాపాడేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) (cbi)  ప్రయత్నిస్తోందా? అంటూ ఆగ్రహం న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణలో ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉన్నారంటూ సీబీఐ అధికారులను నిలదీసింది. వాళ్ల తీరు చూస్తుంటే విచారణ నుంచి తప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఉందని మండిపడింది. 

కాగా.. గతేడాది జూలై 28న ఉదయం జాగింగ్ చేస్తున్న జడ్జి ఉత్తమ్ ఆనంద్ ను దుండగులు ఆటోతో ఢీకొట్టి హత్య చేసిన సంగతి తెలిసిందే. తొలుత ప్రమాదంగానే అంతా భావించినప్పటికీ.. ఘటన మొత్తం స్థానిక సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డవ్వడంతో హత్యగా తేలింది. ఈ నేపథ్యంలోనే అన్ని వైపుల  నుంచి విమర్శలు రావడంతో జడ్జి హత్యపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు (supreme court) ఆదేశించింది. ఈ క్రమంలోనే దాదాపు ఆరు నెలలవుతున్నా హత్య కేసులో కదలిక లేకపోవడంతో ఝార్ఖండ్ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

ఆటోతో ఢీకొట్టడానికి ముందే ఆనంద్ జడ్జి అన్న విషయం నిందితులకు తెలుసన్న విషయం నార్కో పరీక్షల్లో స్పష్టంగా తేలిందని, అలాంటప్పుడు మొబైల్ ఫోన్ ను దొంగిలించేందుకే వాళ్లు ఆటోతో ఢీకొట్టి చంపేశారంటూ సీబీఐ అధికారులు ఎలా చెప్తారని న్యాయస్థానం మండిపడింది. ఈ కేసులో విచారణ తీరు చూస్తుంటే సీబీఐ విశ్వసనీయత మీద సందేహాలు తలెత్తుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. విచారణ నుంచి తప్పించుకునేందుకు నిందితులపై హత్య అభియోగాలు నమోదు చేయడం లేదా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. సీబీఐ నిర్వహించిన నార్కో అనాలిసిస్ పరీక్షల్లో కావాలనే జడ్జిని ఢీకొట్టినట్టు నిందితుడు చెప్పాడని తెలిపింది. మళ్లీ నిందితులకు నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాల్సిన అవసరమేముందని నిలదీసింది.

కేసును ‘హిట్ అండ్ రన్’ కేసుగా మార్చాలని చూస్తున్నారంటూ జడ్జి మండిపడ్డారు. ఝార్ఖండ్‌లో తీవ్రవాదం ఎప్పట్నుంచో ఉందన్న సంగతి తెలుసని, కానీ, ఎప్పుడూ ఒక జడ్జిని హత్య చేసిన దాఖలాలు లేవని అన్నారు. కాగా, కేసును సీబీఐ నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కి బదిలీ చేయాలని అదనపు అడ్వకేట్ జనరల్ ఎస్వీ రాజు కోర్టును కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios