జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కాంగ్రెస్ నాయకుడిని బైక్‌పై వచ్చిన దుండగులు కాల్చిచంపారు. 

జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కాంగ్రెస్ నాయకుడిని బైక్‌పై వచ్చిన దుండగులు కాల్చిచంపారు. రామ్‌గఢ్‌ ఉపఎన్నికకు రెండు రోజుల ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. వివరాలు.. రాష్ట్ర రాజధాని రాంచీకి 50 కిలోమీటర్ల దూరంలో సౌండా ప్రాంతంలోని భుర్కుంద-పాత్రటు రోడ్డులోని పాత పెట్రోల్ పంపు సమీపంలో కాంగ్రెస్ నేత రాజ్‌కిషోర్ బౌరీ అలియాస్ బిట్కా బౌరీ నేతపై గుర్తు తెలియని వ్యక్తులు జరిపారు. శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 

బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు పెట్రోల్ పంప్ దగ్గరకు వచ్చి అక్కడ కూర్చున్న రాజ్‌కిషోర్ బౌరీపై కాల్పులు జరిపారని పోలీసు అధికారులు తెలిపారు. అయితే కాల్పుల్లో గాయపడిన రాజ్‌కిషోర్ బౌరీని వెంటనే భుర్కుండలోని సీసీఎల్ ఆసుపత్రికి తీసుకెళ్లారని చెప్పారు. అయితే ఆయన చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపారు.

తాము రాజ్‌కిషోర్ బౌరీ హత్యపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు ప్రారంభించామని భుర్కుంద పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అమిత్ కుమార్ తెలిపారు. ఈ హత్యకు పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ కూడా ప్రారంభించామని చెప్పారు. ఇక, బర్కాగావ్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబా ప్రసాద్‌కు పట్రాటు బ్లాక్ ప్రతినిధిగా రాజ్‌కిషోర్ బౌరీ కొనసాగుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే అంబా ప్రసాద్, మాజీ మంత్రి యోగేంద్ర సా ఆసుపత్రికి వెళ్లారు. 

ఇదిలా ఉంటే.. రామ్‌గఢ్‌లో ఉపఎన్నిక జరుగుతున్న ప్రాంతంలో ఫిబ్రవరి 16న ఏజెఎస్‌యూ పార్టీ నాయకుడిని గుర్తు తెలియని ముష్కరులు కాల్చి చంపారు. ఇక, రామ్‌గఢ్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఫిబ్రవరి 27న ఉప ఎన్నిక జరగనుండగా.. మార్చి 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.