దేశంలోని కోవిడ్ -19 పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు చేసిన ఫోన్ కాల్‌ను రాష్ట్రంలోని పరిస్థితుల మీద అంచనా కాదు.. కేవలం ప్రధాని "మన్ కీ బాత్" అని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గురువారం అభివర్ణించారు.

గురువారం COVID-19 పరిస్థితి గురించి ప్రధాని మోడీ తనతోపాటు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా,  తెలంగాణ ముఖ్యమంత్రులతో మాట్లాడిన తరువాత  సోరెన్ ఈ విధంగా స్పందించారు.

"ఈ రోజు గౌరవనీయులైన ప్రధానమంత్రి ఫోన్ చేశారు. ఆయన తన "మన్ కి బాత్ "మాత్రమే మాట్లాడారు. అలా కాకుండా పరిస్థితుల గురించి మాట్లాడి, ఆ తరువాత సమస్యల గురించి అడిగి తెలుసుకుంటే బాగుండేది" అని జార్ఖండ్ ముఖ్యమంత్రి ట్వీట్‌లో పేర్కొన్నారు.

రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను ప్రధాని మోడీతో చర్చించడానికి అనుమతించనందుకు సోరెన్ అసంతృప్తితో ఉన్నారని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కోవిడ్ 19 గురించి మాట్లాడేముందు రాష్ట్ర పరిస్థితుల గురించి మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదని వారు అన్నారు. 

దేశంలో ఎక్కువగా నమోదవుతున్న కోవిడ్ కేసులు, మరణాల సంఖ్యలో 75 శాతానికి పైగా ఓ పది రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల్లోనే నమోదవుతున్నాయి. వాటిల్లో జార్ఖండ్ ఒకటి. మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, ఢిల్లీ, ఛత్తీస్ ఘడ్, హర్యానా, పంజాబ్, తమిళనాడు, రాజస్థాన్ లు మిగతా రాష్ట్రాలు. 

జార్ఖండ్ లో గురువారం ఒక్కరోజే 133 మంది కరోనాతో చనిపోయారు. దీంతో రాష్ట్రంలో వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 3,479 కు చేరుకుంది. తాజాగా 6,974 కేసులతో రాష్ట్రంలో ఇప్పటివరకు 2,70,089 మంది వైరస్ బారిన పడ్డారు.

రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం జాతీయ మరణాల రేటు 1.10 శాతానికి మించి,  రాష్ట్రంలో మరణాల రేటు 1.28 శాతంగా ఉంది. జార్ఖండ్‌లో COVID-19 రోగుల రికవరీ రేటు 76.26 శాతం. ఇది జాతీయ సగటులో 82 శాతం.

రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) లో 528 పడకలతో ఏర్పాటు చేసిన తాత్కాలిక COVID-19 ఆసుపత్రిని సోరెన్ గురువారం ప్రారంభించారు.

528 ఆక్సిజన్ పడకల్లో, 327 పడకల్ని రిమ్స్ లోని పార్కింగ్ లాట్ లో ఏర్పాటు చేశారు, మరో 73 ఆంకాలజీ విభాగంలో , ఇంకో 128 ఇన్స్టిట్యూట్ పాత భవనంలో ఏర్పాటు చేశారు.

దీంతోపాటు దేశంలోని అతిపెద్ద ఇంధన సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టిపిసి) సహాయంతో మరో 108 పడకలను ఏర్పాటు చేయనున్నట్లు సోరెన్ తెలిపారు.

కోడెర్మాలోని స్పెషల్ కోవిడ్ ఆరోగ్య కేంద్రంలో ముఖ్యమంత్రి  బుధవారం 250 పడకలను డిజిటల్ గా ప్రారంభించారు.