జార్ఖండ్‌లోని పాలములో దారుణం జ‌రిగింది. ఓ కులానికి చెందిన 50 దళిత కుటుంబాల ఇళ్లను పూర్తిగా ధ్వంసం చేశారు. వీరిని సమీప అడవిలోకి తరిమేశారు.  

 భార‌త‌దేశానికి స్వాతంత్య్ర వ‌చ్చి.. 75 సంవ‌త్స‌రాలు గ‌డిచినా.. ప్ర‌జ‌ల మ‌ధ్య అంత‌రాలు చెరిగిపోలేదు. కులాల, మ‌తాల‌ పేరుతో నిత్యం ఏదోక చోట ఘ‌ర్ష‌ణ‌లు చెలరేగుతున్నాయి. ప్ర‌ధానంగా అణ‌గారిన వ‌ర్గాల‌పై దాడులు జ‌రుగుతూనే ఉన్నాయి. తాజాగా ముస్లిం సమాజానికి చెందినవారు కొంత‌మంది దళిత కుటుంబాలపై దాడి చేసి.. వారి ఇండ్ల‌ను కూల్చివేసి.. ఊరిలో నుంచి తరిమి వేశారు. ఈ వివక్షాపూరిత ఘటన జార్ఖండ్‌లోని పలామూ జిల్లా మరుమటు గ్రామంలో జరిగింది. 

 వివ‌రాల్లోకెళ్తే.. పలము జిల్లాలోని మరుమటు గ్రామంలో ముషార్ (ద‌ళిత) కులానికి చెందిన 50 కుటుంబాలు గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా నివ‌సిస్తున్నారు. సోమవారం హఠాత్తుగా ముస్లిం సమాజానికి చెందిన కొంత‌మంది గుమిగూడుగా వ‌చ్చి.. త‌మపై దాడి చేసి ఇంటిసామగ్రిని బయటపడేసి ఇండ్ల‌ను కూల్చివేశారని మహాదళిత్ ముసాహర్ కుటుంబానికి చెందిన 50 మంది ఆరోపిస్తున్నారు. 

తమ వస్తువులను బలవంతంగా వాహనంపై ఎక్కించుకుని ఛతర్‌పూర్‌లోని లోటో గ్రామ సమీపంలో వదిలేసినట్లు బాధితులు చెబుతున్నారు. వారి నుంచి త‌ప్పించుకుని బయటపడిన వారు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.

ఈ ఘటన అనంతరం నిరాశ్రయులైన బాధితులు మీడియాతో మాట్లాడుతూ.. సర్వేకు ముందు నుంచి కొండకు సమీపంలో ఇళ్లు, గుడిసెలు వేసుకుని జీవిస్తున్నామని చెప్పారు. తాము రోజంతా భిక్షాటన చేసి జీవ‌నం సాగించే వారిమని తెలిపారు. ముస్లీం వర్గాలకు చెందిన త‌మ‌ని ఉద్దేశపూర్వకంగానే త‌మ‌పై దాడి చేసి.. నిరాశ్రయులను చేసి రోడ్డుపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. ఇళ్లు, గుడిసెను కూల్చివేస్తున్న సమయంలో ముస్లిం వర్గాలకు చెందిన వారు తమ ఇంట్లో సామాగ్రిని ధ్వంసం చేశారని, తిండి గింజ‌ల‌ను పాడేశార‌ని బాధితులు తెలిపారు. దీంతో పిల్లలతో సహా ప్రజలంతా ఆకలితో అలమటిస్తున్నామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

అదే సమయంలో ద‌ళితులు నివ‌సిస్తున్న ఆ భూమి మదర్సాకే చెందుతుందని ముస్లిం వర్గానికి చెందిన ప్రజలు తమ వివరణలో పేర్కొన్నారు. ఇంటిని బలవంతంగా బద్దలు కొట్టినట్లు ఫిర్యాదు చేయడంతో నిరాశ్రయులైన ముసాహర్ సంఘం ప్రజలు పాండు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ప్రధాన కార్యాలయం నుంచి సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌డిఓ రాజేష్‌కుమార్‌ సాహ్‌, ఎస్‌డిపిఓ సుజిత్‌కుమార్‌ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు ప్రారంభించారు. విచారణ అనంతరం ఈ కేసులో 12 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

అదే సమయంలో150 మంది గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. బాధిత కుటుంబాలకు మళ్లీ ఊరిలో వారి స్థలాల్లోనే నివాస సౌకర్యాలు కల్పిస్తామ‌ని, ప్రస్తుతం తాత్కాలిక శిబిరాల్లో ఉంచామని అధికారులు తెలిపారు. బాధ్యులను విడిచిపెట్టబోమని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై రాష్ట్ర గవర్నర్‌ రమేశ్‌ స్పందించారు. రెండ్రోజుల్లో నివేదిక సమర్పించాల‌ని పలాము డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు.