జేఈఈ మెయిన్ 2021 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను జాతీయ పరీక్షల మండలి సోమవారం ప్రకటించింది. తొలి విడుతలో దేశవ్యాప్తంగా ఆరుగురు విద్యార్థులు 100శాతం పర్సంటైల్ సాధించగా.. పలు విభాగాల్లో తెలుగు విద్యార్థులూ సత్తాచాటారు.

ఏపీకి చెందిన పి.చేతన్, మనోజ్ఞ సాయి,  తెలంగాణకు చెందిన చల్లా విశ్వనాథ్, బాలికల విభాగలో కొమ్మ శరణ్య 99.99శాతం మార్కులు సాధించారు. ఈడబ్ల్యూఎస్ విభాగంలో ఏపీకి చెందిన ఏవీ జయ చైతన్య, ఓబీసీ విభాగంలో తెలంగాణ విద్యార్థి టీ.వీ మణికంఠ తమ ప్రతిభను చాటారు.

ఎస్టీ కేటగిరిలో తెలంగాణకు చెందిన నితిన్, బీపీ వర్మ, ఎన్ ప్రీతమ్ ఉత్తమ మార్కులు సాధించారు. దివ్యాంగుల విభాగంలో ఏపీకి చెందిన ఎం.ఎస్ ప్రణవ్ మూడో ర్యాంకు, సాయికృష్ణ నాలుగో ర్యాంకు సాధించారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు నాలుగు రోజులపాటు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా మొత్తం 6.61లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ 2021కు హాజరు కాగా... ఇందులో 6.20లక్షల మంది వరకు పేపర్-1 రాశారు. వీరిలో తెలుగు రాష్ట్రాల్లోనే లక్షన్నర మంది ఉండటం విశేషం.