Asianet News TeluguAsianet News Telugu

యడియూరప్ప ప్రభుత్వంలోకి కుమారస్వామి..?

కొందరు ఎమ్మెల్యేలు బీజేపీకి బయటి నుంచి మద్ధతు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కుమారస్వామి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ప్రశ్నగా మిగిలింది

jds may support bjp govt in karnataka
Author
Bangalore, First Published Jul 27, 2019, 2:58 PM IST

కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని కూలదోసినా..  ముఖ్యమంత్రిగా యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేసినా బీజేపీ శ్రేణుల్లో ఆ ఆనందం మాత్రం లేదు.  ఎందుకంటే యడ్డీ సర్కార్ బలపరీక్షను ఎదుర్కోవాల్సి ఉంది.

ఇప్పుడున్న రాజకీయ పరిస్ధితుల్లో ఇది అంత తేలికైన పని కాదు. అయితే కమలనాథులు మాత్రం తదుపరి వ్యూహాలు రచిస్తున్నారు. ముగ్గురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయడంతో అసెంబ్లీలో శాసనసభ్యుల సంఖ్య  221కి చేరింది.

దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 112 అయ్యింది. బీజేపీకి  ప్రస్తుతం 105 మంది ఎమ్మెల్యేలతో పాటు ఓ స్వతంత్ర ఎమ్మెల్యే మద్ధతు ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన ఆరుగురిని బీజేపీ ఎలా సంపాదిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో జేడీఎస్ మద్ధతు కోరతారా అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు శుక్రవారం రాత్రి కుమారస్వామి అధ్యక్షతన జేడీఎస్ ఎమ్మెల్యేలు ఓ హోటల్‌లో సమావేశమయ్యారు.

ఈ  భేటీలో యడ్యూరప్ప ప్రభుత్వంలో చేరడమా..? లేక ప్రజల్లో ఉంటూ యడియూరప్పపై పోరాటం చేయడమా అన్న అంశంపై ప్రధానంగా చర్చ  జరిగినట్లుగా దేవెగౌడ వెల్లడించారు.

అయితే కొందరు ఎమ్మెల్యేలు బీజేపీకి బయటి నుంచి మద్ధతు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కుమారస్వామి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ప్రశ్నగా మిగిలింది.

ఇంతకాలం తమకు అండగా నిలిచిన కాంగ్రెస్‌ పక్షాన జేడీఎస్ నిలబడుతుందా..? లేక  బీజేపీ పంచన చేరుతుందా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అటు బీజేపీ సైతం జేడీఎస్‌తో మంతనాలు జరుపుతూనే.. రెబల్ ఎమ్మెల్యేలను సైతం తమవైపుకు తిప్పుకునేందుకు పావులు కదుపుతోంది. ఈ క్రమంలో సోమవారం జరిగే విశ్వాస పరీక్షపై ఉత్కంఠ నెలకొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios