బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దుండగులు రెచ్చిపోయారు. ఓ ప్రచార సభలో కాల్పులకు తెగబడటంతో అభ్యర్ధి సహా మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. షియోహర్ జిల్లా పూర్ణహియా పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఘటనలో నారాయణ్ సింగ్ అనే అభ్యర్ధి, ఆయన అనుచరులు సంతోష్ కుమార్, అలోక్ రంజన్‌లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో శ్రీనారాయణ్, సంతోష్ మరణించగా.. అలోక్ పరిస్ధితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.

కొంతమంది దుండగులు సానుభూతి పరుల్లా నటిస్తూ నారాయణ్ సింగ్‌ను వెంబడించి హతమార్చారని చెప్పారు. జనతాదళ్ రాష్ట్రవాదీ పార్టీ తరపున షియోహర్ అసెంబ్లీ స్థానం నుంచి నారాయణ్ సింగ్ బరిలో నిలిచారు.

కాల్పుల్లో గాయపడిన బాధితులను మెరుగైన చికిత్స కోసం సితామర్హి జిల్లా ఆస్పత్రికి తరలించామని, అభ్యర్థితోపాటు మరో వ్యక్తి చనిపోయారని ఎస్పీ తెలియజేశారు. నారాయణ్ సింగ్‌‌ చాతీ భాగం సహా శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లాయి.

ఈ ఘటనలో ఎంత మంది నేరస్థులు పాల్గొన్నారనేది స్పష్టత లేదని, ఒకర్ని మాత్రం గ్రామస్థులు పట్టుకున్నారని తెలిపారు. అతడి వద్ద ఓ తుపాకిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ చెప్పారు.

నారాయణ్ సింగ్‌పై మొత్తం 30 క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఆయన కరుడగట్టిన నేరస్థుడని అన్నారు. గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన అతడు ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి ప్రయత్నిస్తున్నారు.