తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో వైద్యం పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ హాస్పిటల్ లో ఆమె వైద్యం పొందే సమయంలో ఎలా ఉండేది అనే విషయంపై ఓ డాక్టర్ సంచలన విషయాలు వెల్లడించారు.

 వైద్యం పొందే సమయంలో కొన్నిసార్లు జయలలిత చిరునవ్వు నవ్వేవారని, అప్పుడప్పుడు ఒంటరిగా వదిలేయమని కోరేవారని ఆ సమయంలో ఐసీయూలో విధులు నిర్వహించిన డాక్టర్ శిల్ప  పేర్కొన్నారు. ఈ మేరకు జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌కు ఆమె వాంగ్మూలం ఇచ్చారు. 

జయలలిత 2016 సెప్టెంబరులో ఆస్పత్రిలో చేరగా 75రోజులపాటు వైద్యం పొంది మరణించారు. 2017లో జయలలిత మరణంపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాలని జస్టిస్‌ ఆర్ముగస్వామి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను సర్కారు ఏర్పాటు చేేసింది. పలువుర్ని కమిషన్‌ విచారిస్తోంది. 

నివేదికను ప్రభుత్వానికి వీలైనంత త్వరగా అందజేయాలని విచారణను కమిషన్‌ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా జయలలిత ఆస్పత్రిలో చేరినప్పడు అక్కడ ఐసీయూలో విధులు నిర్వర్తించిన డాక్టర్‌ శిల్ప ఇటీవల కమిషన్‌ ముందు హాజరయ్యారు.అత్యవసర చికిత్సల డ్యూటీ డాక్టర్‌గా శిల్ప ఆ యేడాది అక్టోబరు ఒకటి నుంచి జయ మరణించటానికి ముందురోజు (డిసెంబ రు 4) వరకు వైద్య సేవలందించారు.