తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ వేగవంతమయ్యింది. జయలలితకు చికిత్సనందించిన ముగ్గురు ఎయిమ్స్ వైద్యులకు జస్టిస్ అరుముగస్వామి కమిషన్ సమన్లు జారీ చేసింది. 

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ వేగవంతమయ్యింది. జయలలితకు చికిత్సనందించిన ముగ్గురు ఎయిమ్స్ వైద్యులకు జస్టిస్ అరుముగస్వామి కమిషన్ సమన్లు జారీ చేసింది. 2016 సెప్టెంబరు 22 నుంచి డిసెంబరు 5 వరకు జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆ సమయంలో ముగ్గురు ఎయిమ్స్ వైద్యులు ఆమెకు వైద్యసేవలందించారు. అనంతరం 2016 డిసెంబరు 5న జయలలిత తుదిశ్వాస విడిచారు. 


జయలలిత స్నేహితురాలు శశికళ.. చికిత్స సమయంలో అమ్మను ఎవ్వరినీ కలవనివ్వకపోవడంపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం అమ్మ మృతిపై విచారణకు కమిషన్ ను నియమించింది. మృతి కేసులో విచారణ జరుపుతున్నకమిషన్‌ జయలలిత ఆఖరి రోజుల్లో అపోలో ఆస్పత్రిలో చికిత్సనందించిన ఎయిమ్స్ వైద్యులు పల్మొనాలజీ విభాగానికి చెందిన జీసీ ఖిలానీ, అనస్థియాలజీ ప్రొఫెసర్‌ అంజన్‌ త్రిఖా, కార్డియాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ నితీశ్‌ నాయక్‌లకు కమిషన్‌ సమన్లు ఇచ్చింది. 

ముగ్గురు వైద్యులు ఆగష్టు 23, 24 తేదీల్లో కమిషన్‌ ఎదుట హాజరవ్వాలని సూచించింది. ఇప్పటికే వారికి సమన్లు అందాయని, వారు కమిషన్‌ ఎదుట హాజరయ్యేందుకు అంగీకరించారని దర్యాప్తు ప్యానెల్‌ వెల్లడించింది