తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత మృతి కేసు విచారణ కీలక మలుపు తిరిగింది. ఈ కేసుపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ నమోదు చేస్తోన్న వాంగ్మూలాలు తప్పుల తడకేనంటూ ఆమెకు చికిత్సనందించిన అపోలో ఆసుపత్రి వర్గాలు వ్యాఖ్యానించడంతో తమిళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

జయలలితకు అందించిన చికిత్స రికార్డులను పరిశీలించడానికి 21 మంది డాక్టర్లు లేదా వైద్య నిపుణులతో కొత్తగా ఒక బోర్డును ఏర్పాటు చేయాల్సింది అపోలో డిమాండ్ చేసింది. ‘‘ ప్రపంచంలోని ఎక్కడి నిపుణులైనా సరే.. వివిధ వైద్య విభాగాలకు చెందిన వారిని పిలిపించింది.. తెలిసీ తెలియకుండా వాంగ్మూలాలు రికార్డు చేస్తే కేసు తప్పు దోవ పడుతుందని అపోలో జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్‌కు ఇచ్చిన అవిఫడవిట్‌లో పేర్కొంది.

‘‘ వైద్యానికి సంబంధించిన వివరాలను వెల్లడించడం చాలా సంక్లిష్టమైన పని.. కమిషన్ నియమించిన టైపిస్టుకు వైద్య పరిభాషపై తగిన అవగాహన లేకపోవడం వల్ల చాలా అంశాలను తప్పుగా అన్వయం చేసుకుని టైప్ చేశారని అపోలో తన అఫిడవిట్‌లో పేర్కొంది.

ఉదాహరణకు ‘‘ఇంటుబేషన్’’ అనే పదాన్ని ‘‘ఇంక్యుబేషన్’’ అని టైప్ చేశారని.. ఇలాంటివి వాంగ్మూలం నిండా చాలా ఉన్నాయని ఎత్తి చూపింది. అందుకే రికార్డుల పరిశీలన కోసం మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు పేర్కొంది. మరోవైపు జయ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో సీసీటీవీలను నిలిపివేయాలని, నలుగురు పోలీసులు అధికారులు తమను డిమాండ్ చేసినట్లు అపోలో పెద్ద బాంబు పేల్చింది.

ఇదిలావుండగా తమ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పాటు మంత్రి సి. విజయభాస్కర్, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురైలకు జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ నోటీసులు జారీ చేసింది. అలాగే జయలలితకు అత్యవసర చికిత్స అందించిన ప్రముఖ లండన్ వైద్యుడు రిచర్డ్ బేలేను కూడా జనవరి 9న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు కావాల్సిందిగా కమిషన్ ఆదేశించింది.