రాయ్‌పూర్: మావోయిస్టుల చెరలో ఉన్న కోబ్రా బెటాలియన్ కు చెందిన రాకేశ్వర్ సింగ్ ను క్షేమంగా వదిలేయాలని ఆయన కూతురు ఏడుస్తూ మావోయిస్టులను కోరారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

శనివారం నాడు ఛత్తీస్‌ఘడ్ లో మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో 24 మంది జవాన్లు మృతి చెందిన రాకేశ్వర్ సింగ్ తమ ఆధీనంలో ఉన్నాడని మావోయిస్టులు ఓ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు స్థానిక రిపోర్టర్లకు కూడా ఫోన్ చేసి రాకేశ్ సింగ్ తమ వద్ద క్షేమంగా ఉన్నాడని ప్రకటించారు.

రెండు మూడు రోజుల్లో రాకేష్ సింగ్ ను వదిలిపెడతామని మావోయిస్టులు ప్రకటించారు.ఈ సమాచారం తెలుసుకొన్న రాకేష్ సింగ్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

తన భర్తను వీలైనంత త్వరగా రక్షించాలని జవాన్ భార్య ప్రభుత్వాన్ని కోరారు. మా నాన్నను వదిలేయండి అంటూ ఓ రాకేష్ సింగ్ కూతురు మావోయిస్టులను కన్నీటితో అడుగుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

పాప అడుగుతున్న సమయంలో అక్కడ ఉన్నవారంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కూంబింగ్ ఆపరేషన్  కు వెళ్లే ముందు  రాకేశ్వర్ సింగ్ తమతో మాట్లాడినట్టుగా కుటుంబసభ్యులు చెప్పారు. శనివారం రాత్రి నుండి తాము ఫోన్ చేస్తున్నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదన్నారు. ఆ తర్వాత విషయం తెలిసిందని జవాన్ భార్య తెలిపారు.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన కోబ్రా బెటాలియన్ చెందిన రాజేశ్వర్ సింగ్ ఛత్తీస్‌ఘడ్ లోని బీజాపూర్ లో కూంబింగ్ కు వెళ్లాడు.