ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన ఉగ్రవాది జావేద్ అహ్మద్ మట్టూ.. అతడు ఎవరంటే ?
Javed Ahmed Mattoo : 10 లక్షల రివార్డు తలపై ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదిని దేశ రాజధానిలో గురువారం పోలీసులు అరెస్టు చేశారు. అతడు జమ్మూకాశ్మీర్ లో జరిగిన పలు ఉగ్రవాద ఘటనల్లో నిందితుడిగా ఉన్నాడు. అతడు జమ్మూ కాశ్మీర్ లోని సోపోర్ కు చెందినవాడు.
Javed Ahmed Mattoo Arrested : జమ్మూకాశ్మీర్ లోని హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన వాంటెడ్ ఉగ్రవాది జావేద్ అహ్మద్ మట్టూ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. పక్కా ప్లాన్ తో అతడిని గురువారం ఢిల్లీలో పట్టుకున్నారు. కేంద్ర సంస్థల సహకారంతో ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ బృందం మట్టూను అరెస్టు చేసింది. మట్టూ నుంచి ఒక పిస్టల్, ఆరు లైవ్ కాట్రిడ్జ్ లు, దొంగిలించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జమ్మూకాశ్మర్ లో 11 ఉగ్రదాడుల సూత్రధారి అయిన మట్టూ భద్రతా సంస్థల జాబితాలో లోయలోని టాప్ 10 టార్గెట్ లలో ఒకడిగా ఉన్నాడు. అతడి తలపై రూ.10 లక్షల రివార్డు ఉంది. మట్టూ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సేకరించడానికి ఢిల్లీ-ఎన్సీఆర్ కు వస్తున్నట్టు కొద్ది రోజుల క్రితం ఢిల్లీ పోలీసులకు సమాచారం అందింది.
అలాగే మట్టూకు పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్ ఆయుధాలు, మందుగుండు సామగ్రి పంపిణీని కో ఆర్డినేట్ చేస్తాడని, అతడు జమ్మూ కాశ్మీర్‌లో తీవ్రవాద దాడులకు పాల్పడతాడని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పక్కా సమాచారంతో స్లీపర్ సెల్స్, ఆయుధ సరఫరాదారులపై నిఘా పెట్టిన వర్గాలు రంగంలోకి దిగి అరెస్టు చేశాయి.
జమ్మూ కాశ్మీర్ లోని సోపోర్ కు చెందిన మట్టూ పలుమార్లు పాకిస్థాన్ కు వెళ్లాడు. అతడి కోసం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బృందం గాలింపు చర్యలు చేపట్టిందని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ తెలిపింది. కాగా.. గత ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జావేద్ సోదరుడు రయీస్ మట్టూ జమ్ముకాశ్మీర్ లోని సోపోర్ లో జాతీయ జెండాను ఎగురవేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.