జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా భారత పర్యటన సందర్భంగా 3.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లుగా జపాన్ మీడియా కథనాలు ప్రచురించింది. వచ్చే ఐదేళ్లలో అన్ని రంగాల్లో ఇన్వెస్ట్‌మెంట్ జరుగుతుందని సమాచారం.
రెండు రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చిన జపాన్ ప్రధాని (japan prime minister) ఫుమియో కిషిడా (fumio kishida) ... ప్రధాని నరేంద్ర మోడీతో (narendra modi) శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జపాన్ ప్రధాని కిషిడాకు.. మోడీ స్వాగతం పలికారు. అనంతరం ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు గురించి చర్చించినట్టు తెలుస్తోంది. భారత్, జపాన్‌ల మధ్య 14వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో ఇరు దేశ ప్రధానులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సదస్సులో భారత్, జపాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఇండో-పసిఫిక్‌లో శాంతి, స్థిరత్వం, ఇరు దేశాల మధ్య సహకారంపై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం గురించి కూడా చర్చించినట్టు సమాచారం. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ పీఎం కిషిడాల మధ్య జరిగిన శిఖరాగ్ర చర్చల్లో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ, ప్రపంచ అంశాలు కూడా ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ వెల్లడించారు.
ఈ సందర్భంగా భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ సిద్ధమైనట్లుగా ఆ దేశ మీడియా కథనాలను ప్రసారం చేసింది. వచ్చే ఐదేళ్లలో వేర్వేరు రంగాల్లో 42 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిడా ప్రకటించారు. దీనికి సంబంధించిన ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు కూడా చేసినట్టు జపాన్ మీడియా తెలిపింది. 2014లో అప్పటి ప్రధాని షింజో అబే (shinzo abe) ప్రకటించిన 3.5 ట్రిలియన్ యెన్ల పెట్టుబడులకు ఇవి అదనమని జపాన్ మీడియా వెల్లడించింది. కర్బన ఉద్గారాల తగ్గింపు, క్లీన్ ఎనర్జీ విభాగాల్లో భారత్ సహకారాన్ని కోరుతుందని పేర్కొన్నారు.
భారత్ కేంద్రంగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తోన్న జపాన్ సంస్థలు తమ వాణిజ్య కార్యకలాపాలను మరింత విస్తరింపజేసుకోవడానికి అవసరమైన అనుమతులను సింగిల్ విండో సిస్టమ్‌లో మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరతారని జపాన్ మీడియా వెల్లడించింది. భారత్‌లో పలు నగరాభివృద్ధి ప్రాజెక్టులను జపాన్.. అన్ని రకాలుగా తన సహకారాన్ని అందిస్తోంది. ఆర్థికం, సాంకేతికపరంగా దోహదం చేస్తోంది. హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీలోనూ కీలక పాత్రను పోషిస్తోంది. భారత్-జపాన్ మధ్య అన్ని రంగాల్లోనూ సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. దశాబ్దాల కాలంగా ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక, సాంస్కృతిక సంబంధాలు ధృడంగా ఉన్నాయి.
అంతకుముందు ఇండియాకు చేరుకున్న జపాన్ ప్రధాని కిషిడాకు ఢిల్లీ విమానాశ్రయంలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ స్వాగతం పలికారు. ఆదివారం రాత్రి 8 గంటలకు తిరుగు ప్రయాణం కానున్నారు. ఇక్కడ నుంచి ఆయన కంబోడియా వెళ్లనున్నారు. అయితే ఆయన భారత్‌కు వచ్చే ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం ఆమోద యోగ్యం కాదని, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అలాంటి చర్యలను ఎప్పటికీ అనుమతించరాదని కిషిడా అన్నారు.
కాగా భారత్, జపాన్ ప్రధానులు ఢిల్లీలో సమావేశం కావడం ఇదే తొలిసారి. భారత్, జపాన్ మధ్య చివరిసారి 2018లో టోక్యోలో శిఖరాగ్ర సమావేశం జరిగింది. 2021 అక్టోబర్‌లో ప్రధానమంత్రి కిషిడా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రధాని మోడీ ఫోన్‌లో మాట్లాడారు. ఈ ఏడాది రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు పూర్తవ్వడం విశేషం.
