మహారాష్ట్రలో జనతా కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది సర్కార్. రేపు ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు మాత్రమే నిత్యావసర వస్తువుల దుకాణాలు తెరచుకోనున్నాయి.

ప్రతి షాపు కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కస్టమర్‌తో కాంటాక్ట్ కాకుండా గ్లాస్ సీల్డ్ ఉపయోగించాలని సూచించింది. ఏదైనా షాపులు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని అధికారులు వార్నింగ్ ఇచ్చారు.

మహారాష్ట్రలో 15 రోజుల పాటు అన్ని సినిమా హాళ్లు మూతపడనున్నాయి. జనం అధికంగా వచ్చ అమ్యూజ్‌మెంట్ పార్కులు, వీడియో గేమ్ పార్లర్లు కూడా క్లోజ్ కానున్నాయి. కరోనా వైరస్‌ను వ్యాప్తి చేసే క్లబ్బులు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్ములు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు మూతపడతాయి.

Also Read:జనతా కర్ఫ్యూ : మహారాష్ట్రలో కిక్కిరిసిన రైల్వే స్టేషన్లు

ఇక సినిమా షూటింగ్‌లపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా షూటింగ్‌లు, సీరియల్ షూటింగ్‌లకు ప్యాకప్‌ చెప్పేసింది. యాడ్ షూటింగ్‌లకు కూడా  జనతా కర్ఫ్యూలో అనుమతి లేదు.

నిత్యావసర వస్తువుల దుకాణాలు పక్కనబెడితే.. మిగిలిన షాపులు, మాల్స్, షాపింగ్ సెంటర్లు మూతపడనున్నాయి. వీటితో పాటు పబ్లిక్ గార్డెన్లు, బీచ్‌లు, ఖాళీ ప్రాంతాలను కూడా మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఎలాంటి అనుమతి లేకుండా బయట తిరిగినా చర్యలు తప్పవు. అన్ని మతాల ప్రార్థనా మందిరాలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. స్కూళ్లు, కాలేజీలతో పాటు ప్రైవేట్ కోచింగ్ క్లాసులకు కూడా అనుమతి లేదు.

సెలూన్లు, స్పాలు, పార్లర్లు ఓపెన్ చేయవద్దని స్పష్టం చేసింది. అయితే తాజా ఆంక్షలతో ఇబ్బంది పడనున్న పేదలను ఆదుకునేందుకు కొత్త పథకం ప్రవేశపెట్టింది మహా సర్కార్. ప్రత్యేక కార్యక్రమాల కింద పేదలకు 3 కిలోల గోధుమలు, 2 కిలోల బియ్యం పంపిణీ చేయనున్నట్లు సీఎం ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు. 

ఇక ఆటో డ్రైవర్లు, వీధి వ్యాపారులకు 1,500 ఆర్ధిక సాయం అందజేస్తామన్నారు సీఎం. ఈ ఆర్ధిక సాయం కుటుంబాల ఆర్ధికస్థితిని నిలబెడుతుందని ఆయన ఆకాంక్షించారు.