Asianet News TeluguAsianet News Telugu

ఇద్దరు లష్కర్ టెర్రరిస్టులను పట్టుకున్న గ్రామస్తులు.. పోలీసులకు అప్పగింత.. ఊరి ప్రజలకు రూ. 5 లక్షల రివార్డు

జమ్ము కశ్మీర్‌లో ఓ అసాధారణ ఘటన జరిగింది. అక్కడ ఎన్‌కౌంటర్లు నిత్యకృత్యంగా మారిన విషయం సర్వసాధారణమైపోయింది. కానీ, ఓ గ్రామ ప్రజలు స్వయంగా ధైర్యం చేసి ఇద్దరు లష్కర్ ఉగ్రవాదులను పట్టుకుని పోలీసులకు అప్పజెప్పడం చర్చనీయాంశమైంది. ఇది ఉగ్రవాదం అంతానికి తొలి అడుగుగా జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వారిని ప్రశంసించారు.
 

jammu kashmir village people nabbed terrorists in reasi district
Author
New Delhi, First Published Jul 3, 2022, 3:59 PM IST

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో ఉగ్రబెడద తగ్గడం లేదు. ఎన్ని ఎన్‌కౌంటర్లు జరిగినా.. ఉగ్రవాదుల కదలికలు మాత్రం కనిపిస్తూనే ఉన్నాయి. కొన్ని సార్లు స్థానికులు కూడా ఆ ఎన్‌కౌంటర్లలో బలి అవుతుంటారు. ఎక్కడ ఉగ్రవాది కనిపించినా ప్రజలు భయకంపితులు అవుతున్నారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నవారు వారికి ఆశ్రయం ఇస్తుంటే సాధారణ ప్రజలు వణికిపోతుంటారు. కానీ, ఈ సారి ఇందుకు భిన్నమైన ఘటన ఒకటి జరిగింది. జమ్ము కశ్మీర్‌లో అసాధారణ ఘటన జరిగింది. సామాన్య ప్రజలే అసామాన్య పని చేసి పెట్టారు. రియాసి జిల్లాలో ఓ గ్రామంలో ప్రజలు ఉగ్రవాదులను గుర్తించారు. వెంటనే వారు చుట్టుముట్టి భారీ ఆయుధాలతో ఉన్న ఇద్దరు లష్కర్ ఉగ్రవాదులను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులకు అప్పగించారు.

జమ్ము కశ్మీర్‌లో రియాసి జిల్లాలోని టుక్సన్ గ్రామంలో ఇద్దరు లష్కర్ ఉగ్రవాదులు దిగారు. వారిని ప్రజలు గుర్తించారు. కానీ, భారీ ఆయుధాలతో ఉన్న ఆ ఇద్దరినీ పట్టుకోవడం కష్టమైంది. కానీ, ఎలాగోలా వారంతా ధైర్యం చేసి ఇద్దరు ఉగ్రవాదులను పట్టుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుని వారిని తమ అదుపులోకి తెచ్చుకున్నారు. ఆ ఉగ్రవాదుల వద్ద రెండు ఏకే 47 రైపిళ్లు, ఏడు గ్రెనేడ్లు, ఒక పిస్టల్‌ను వారు స్వాధీనం చేసుకున్నారని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు, జమ్ము వెల్లడించారు. 

గ్రామస్తులు పట్టుకున్న ఇద్దరు ఉగ్రవాదులను లష్కర్ కమాండర్ తాలిబ్ హుస్సేన్, ఫఐజల్ అహ్మద్ దార్‌గా గుర్తించారు. ఇటీవలే రియాసి జిల్లాలో ఐఈడీ బ్లాస్టు‌లకు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ పాల్పడింది. ఈ పేలుళ్ల వెనుక ప్రధాన సూత్రధారిగా తాలిబ్ హుస్సేన్ ఉన్నారు. తాజాగా, ఆ తాలిబ్ హుస్సేన్‌ను గ్రామ ప్రజలు పట్టుకున్నారు.

కాగా, వారి వీరోచిత చర్యపై జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రశంసలు కురిపించారు. గ్రామస్తుల ధైర్యాన్ని మెచ్చుకున్నారు. రియాసిలోని టుక్స్ ధోక్ గ్రామస్తుల ధైర్యానికి తాను సెల్యూట్ చేస్తున్నట్టు ట్వీట్ చేశారు. సాధారణ పౌరుల్లో ఇలాంటి ఆలోచనలు రావడం చూస్తుంటే.. జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదం మరెంతో కాలం మనుగడ సాధించలేదని అర్థం అవుతున్నదని వివరించారు. టెర్రరిస్టులు, టెర్రరిజంపై గ్రామస్తులు ధైర్య సాహసాలను కొనియాడుతూ, వారి సాహసోపేత చర్యకు రూ. 5 లక్షల క్యాష్ రివార్డును ఆయన ప్రకటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios