జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్ధితుల దృష్ట్యా శ్రీనగర్‌ నిట్‌లో చదువుకుంటున్న తెలుగు విద్యార్ధులు ఢిల్లీ చేరుకున్నారు. జమ్మూ నుంచి శనివారం అర్ధరాత్రి 31 మంది విద్యార్ధులు అండమాన్ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీకి చేరుకున్నారు. వీరికి ఏపీ భవన్ అధికారులు భోజనాలు అందించారు.

ఆదివారం ఉదయం జమ్మూ నుంచి మరో 90 మంది విద్యార్ధులు ఢిల్లీకి బయలుదేరారు. కాగా కశ్మీర్‌లో ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో నెలకొన్ని పరిస్ధితుల దృష్ట్యా ఇతర రాష్ట్రాల విద్యార్ధులు శ్రీనగర్‌ నిట్‌ను ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా నిట్ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.

దీంతో దిక్కుతోచని స్ధితిలో పడిపోయిన విద్యార్ధులు తమకు సాయం చేయాలంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ట్విట్టర్ ద్వారా కోరిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి తెలుగు విద్యార్ధులను కశ్మీర్ నుంచి సురక్షితంగా ఢిల్లీకి తీసుకురావాల్సిందిగా తెలంగాణ భవన్ అధికారులను ఆదేశించారు.

సీఎస్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన తెలంగాణ భవన్ అధికారులు జమ్మూ నుంచి ఢిల్లీకి విద్యార్ధులను తీసుకువచ్చేందుకు మూడు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఢిల్లీ నుంచి వీరిని హైదరాబాద్‌కు పంపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

"